Home AP డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాపై రచ్చ రచ్చ

డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాపై రచ్చ రచ్చ

వైసీపీ ఆందోళన, టీచర్ల ఎదురుదాడి.
శాప్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .

విజయవాడలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యాలయం వద్ద సోమవారం మెగా డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాల వివాదం ఉద్రిక్తంగా మారింది. స్పోర్ట్స్‌ కోటా ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు తమపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, క్రీడా మంత్రి మండిపల్లి రామప్రసాద్‌రెడ్డి, శాప్‌ ఎండీకి వినతిపత్రాలు ఇచ్చేందుకు కార్యాలయానికి చేరుకున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ఇరువర్గాలు పరస్పరం నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.

మా సర్టిఫికెట్లు నిజమైనవేనన్న టీచర్లు

స్పోర్ట్స్‌ కోటా టీచర్లు తమ వద్ద ఉన్న క్రీడా ధ్రువపత్రాలు, మెడల్స్‌ అసలైనవేనని స్పష్టం చేశారు. అవసరమైతే సంబంధిత ఒరిజినల్‌ పత్రాలు సమర్పించి తమ అర్హతలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆధారాలు పరిశీలించకుండా తమపై ఆరోపణలు చేయడం సరికాదని, నియామకాలను రాజకీయ అంశంగా మార్చవద్దని కోరారు. తమకు ఉద్యోగాలు క్రీడా ప్రతిభ, అర్హతలు, ధ్రువపత్రాల ఆధారంగానే లభించాయని చెప్పారు. శాప్‌ ఎండీ భరణి అక్కడికి చేరుకుని ఉపాధ్యాయులతో మాట్లాడి వారి వినతులను స్వీకరించారు.

అక్రమాలపై విచారణ కోరుతున్న వైసీపీ

మరోవైపు వైసీపీ నేతలు స్పోర్ట్స్‌ కోటాలో నకిలీ లేదా అనుమానాస్పద ధ్రువపత్రాలతో కొందరికి ఉద్యోగాలు దక్కాయని ఆరోపించారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెబుతూ సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐ విచారణ కోరుతున్నారు. ఎంపిక ప్రక్రియలో అవకతవకలు లేవని ప్రభుత్వం భావిస్తే స్వతంత్ర విచారణకు సిద్ధం కావాలని వైసీపీ డిమాండ్‌ చేసింది. ఇదే సమయంలో ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. నిరసనకారులను చెదరగొట్టే క్రమంలో ఉద్రిక్తత ఏర్పడటంతో పలువురు వైసీపీ నేతలను ముందస్తు అదుపులోకి తీసుకున్నారు.

 

#MegaDSC #DSC2025 #SportsQuota #APDSC #YSRCP #SAAP #Vijayawada #DSCRecruitment #SportsQuotaTeachers #CBIProbe #TeacherRecruitment #SportsCertificates #APPolitics #AndhraPradesh #APNews