Home Telangana రాజకీయ కక్షల యాత్రలా? కాంగ్రెస్ ఎంపీలపై హరీశ్‌రావు ఫైర్

రాజకీయ కక్షల యాత్రలా? కాంగ్రెస్ ఎంపీలపై హరీశ్‌రావు ఫైర్

సిద్దిపేటలో ఎంపీల యాత్ర పేరుతో అధికార కాంగ్రెస్‌ ప్రజాధనం, ప్రభుత్వ సమయాన్ని వృథా చేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఏదో యుద్ధానికి వచ్చినట్లుగా యాత్ర నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వాలు వాస్తవాలను దాచిపెట్టినప్పుడు ప్రతిపక్షాలు నిజనిర్ధారణ కోసం క్షేత్రస్థాయికి వెళ్తాయని, కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వమే యాత్రల పేరుతో రావడం శోచనీయమన్నారు. ప్రభుత్వానికి అధికారం ఉన్నందున వాస్తవాలను తెలుసుకునేందుకు నివేదికలు తెప్పించుకోవచ్చని సూచించారు. ఎంపీలంతా రాష్ట్ర హక్కుల కోసం కలిసికట్టుగా కేంద్రంపై పోరాడాలి తప్ప రాజకీయ కక్షసాధింపులకు యాత్రలను ఉపయోగించకూడదని హరీశ్‌రావు అన్నారు.

దళితుల భూములపై నేరుగా సవాల్‌

దళితుల భూముల అంశాన్ని ప్రస్తావిస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు నేరుగా ప్రశ్న సంధించారు. కేసీఆర్‌ వద్ద దళితుల భూములు లేవని తేలితే కాంగ్రెస్‌ నేతలు రాజీనామా చేస్తారా? ఒకవేళ భూములు ఉన్నట్లు నిరూపితమైతే తాము రాజీనామా చేయడానికి సిద్ధమని సవాల్‌ చేశారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం బురద రాజకీయాలకు తెరలేపుతోందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఎన్ని డైవర్షన్‌ రాజకీయాలు చేసినా తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను ప్రశ్నిస్తూనే ఉంటామని, వాటిపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని హరీశ్‌రావు తెలిపారు.

#HarishRao #CongressMPs #Siddipet #SiddipetLandRow #BRS #Congress #RevanthReddy #TelanganaPolitics #LandDispute #LandInspection #DalitLandIssue #PoliticalControversy #BRSvsCongress #HarishRaoNews #SiddipetPolitics