ఉద్యోగులపై రేవంత్ నిర్లక్ష్యమన్న కవిత .
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నెరవేర్చడం లేదని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. ‘మాట తప్పడం.. మడమ తిప్పడం రేవంత్‌రెడ్డి ట్రేడ్‌మార్క్’ అంటూ ఆరోపించారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉద్యోగుల సమస్యలపై జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. గత 32 నెలలుగా ఆరు డీఏలు బకాయి ఉన్నాయని, పీఆర్సీ, పెన్షన్లు, రిటైర్‌మెంట్ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. సమస్యలు పరిష్కరించాలని అడిగే ఉద్యోగులను బెదిరించడం సరికాదని, వారు ప్రభుత్వానికి బానిసలు కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దాదాపు 40 శాతం టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని, ఉన్న ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. 2003లో నియమితులైన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
హెల్త్ కార్డులు పనిచేయడం లేదంటూ ఆరోపణ
ఉద్యోగుల హెల్త్ కార్డులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చెల్లుబాటు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కవిత కోరారు. హెల్త్ కార్డులు పనిచేయకపోతే సీఎం రాజీనామా చేస్తారా? అంటూ సవాల్ విసిరారు. పోలీసు సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని, ఆర్టీసీ ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 206 ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి 37 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచాయని, వాటిలో చాలా వాటికి పెద్దగా ఆర్థిక భారం లేదని చెప్పారు. సెప్టెంబర్ 18లోగా సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. లేకపోతే ఉద్యోగ సంఘాలు హైదరాబాద్ దిగ్బంధానికి పిలుపునివ్వాలని, తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఉద్యోగులను ‘డెవలప్‌మెంట్ పార్ట్‌నర్స్’గా గుర్తించి గౌరవంగా చూస్తామని కవిత ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకపోతే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.
#KKavitha #Kavitha #RevanthReddy #TelanganaEmployees #GovernmentEmployees #TelanganaTeachers #DAArrears #DAHike #PRC #PRCFitment #51PercentFitment #OldPensionScheme #OPS #2003Employees #EmployeeDemands #EmployeeJAC #GO317 #HealthCards #TelanganaGovernment #TelanganaPolitics #BRS #TelanganaRakshanaSena #KavithaNews #RevanthReddyGovernment #TelanganaNews











