జాండ్రపేటలో నేతన్నల ఆగ్రహం సాయం దక్కక రోడ్డెక్కిన చేనేతలు

Weavers Demand Justice

బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేటలో చేనేత కార్మికుల ఆగ్రహం రోడ్డెక్కింది. నేతన్న సేవ పథకం కింద అర్హులైన తమకు రూ.25 వేల సాయం అందలేదని పలువురు చేనేత కార్మికులు ఆందోళనకు దిగారు. ఆగస్టు 7న పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం సాయం అందించినా.. గ్రామంలో నిజంగా చేనేత వృత్తిపై ఆధారపడుతున్న తమకు మాత్రం ప్రయోజనం దక్కలేదని వారు వాపోయారు. అధికారులు, టీడీపీ నాయకులు న్యాయం చేస్తామని గతంలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. నెల రోజులైనా తమకు న్యాయం జరిగలేదని వారు ఆరోపించారు. టీడీపీకి ఓటేసి గెలిపించినా చేనేత పథకాలు తమకు దక్కకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పథకం ద్వారా,  అర్హత ఉన్నవారిని పక్కనపెట్టి అనర్హులకు ప్రయోజనం కల్పించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి రూ.25 వేల సాయం అందించాలని డిమాండ్ చేశారు. తమ సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే పథకం పొందిన అనర్హుల వివరాలతో కూడిన జాబితాను సిద్ధం చేసుకున్న చేనేత కార్మికులు.. ప్రభుత్వ పెద్దలను కలిసి తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.