Home National_news జీడీపీ లెక్కల్లో భారీ కోత ₹43 లక్షల కోట్ల తగ్గించడమేంటి?

జీడీపీ లెక్కల్లో భారీ కోత ₹43 లక్షల కోట్ల తగ్గించడమేంటి?

ప్రభుత్వాన్ని నిలదీసిన జైరాం రమేశ్‌.

తాజా జీడీపీ గణాంకాలపై కాంగ్రెస్‌ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గత నాలుగేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ అంచనా పరిమాణాన్ని ఏకంగా రూ.43 లక్షల కోట్ల మేర తగ్గించడంపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ డిమాండ్‌ చేశారు. 2022-23 నుంచి వరుసగా నాలుగేళ్లకు సంబంధించిన జీడీపీ అంచనాలను ఎందుకు గణనీయంగా కిందికి సవరించారని ప్రశ్నించారు. కొత్త విధానంలో ఏ అంశాల కారణంగా ఈ భారీ మార్పులు వచ్చాయి, ఆ విధానాన్ని రూపొందించే సమయంలో ఎవరిని సంప్రదించారు, ద్రవ్యోల్బణం ప్రభావాన్ని చూపే డిఫ్లేటర్‌ వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తుందా అనే అంశాలపై కేంద్రం సమాధానం చెప్పాలని కోరారు. పద్ధతి మార్చినంత మాత్రాన దేశ ఆర్థిక వ్యవస్థ అంచనా పరిమాణంలో ఇంత పెద్ద తగ్గుదల ఎలా వచ్చిందని జైరాం రమేశ్‌ ప్రశ్నించారు. ఏప్రిల్‌–జూన్‌ 2026 త్రైమాసికంలో 7.8 శాతం వాస్తవ జీడీపీ వృద్ధిని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ ఈ ప్రశ్నలు లేవనెత్తింది.

డిఫ్లేటర్‌పై అనుమానాలు.. వృద్ధి లెక్కలపై చర్చ

జీడీపీ వృద్ధి గణాంకాలు వాస్తవ పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబించడం లేదని కాంగ్రెస్‌ ఆరోపించింది. గతంలో ఏప్రిల్‌–జూన్‌ 2025 జీడీపీ అంచనాను సుమారు రూ.86 లక్షల కోట్ల నుంచి రూ.80 లక్షల కోట్లకు సవరించిన విషయాన్ని జైరాం రమేశ్‌ ప్రస్తావించారు. మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్‌చంద్ర గర్గ్‌ లెక్కలను ఉటంకిస్తూ, పాత బేస్‌ సవరించకుండా ఉంటే తాజా త్రైమాసికంలో నామమాత్ర వృద్ధి 10.3 శాతం కాకుండా సుమారు 2.6 శాతంగా ఉండేదని పేర్కొన్నారు. మరో కీలక అంశంగా జీడీపీ డిఫ్లేటర్‌ను కాంగ్రెస్‌ ప్రశ్నించింది. డిఫ్లేటర్‌ 2.5 శాతంగా ఉండగా రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.9 శాతం, హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణం 9.4 శాతంగా ఉందని రమేశ్‌ గుర్తుచేశారు. తయారీ రంగం జీవీఏ 5.2 శాతం, ప్రైవేట్‌ వినియోగం 5.4 శాతం తగ్గినట్లు గర్గ్‌ లెక్కలను ప్రస్తావించారు. మాజీ చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ అరవింద్‌ సుబ్రమణియన్‌, ఐఎంఎఫ్‌ వ్యక్తం చేసిన జాతీయ ఖాతాలపై ఆందోళనలను కూడా కాంగ్రెస్‌ ప్రస్తావిస్తూ జీడీపీ గణాంకాల విధానంపై కేంద్రం మరింత పారదర్శకత చూపాలని డిమాండ్‌ చేసింది.

 

#GDPData #IndiaGDP #GDPRevision #JairamRamesh #GDPGrowth #IndianEconomy #GDPDeflator #GDPStatistics #Q1GDP #EconomicGrowth #Congress #GDPMethodology #NationalAccounts #IndiaEconomy #GDPControversy