Home AP స్థానిక ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లు

స్థానిక ఎన్నికల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లు


బడుగుల జీవితాల్లో మార్పు తెచ్చే పెద్ద నిర్ణయం
ఎన్నికల హామీ మాత్రమే కాదు… రాజకీయ సిద్ధాంతం
ప్రతి బీసీ కుటుంబం గర్వంగా చెప్ప్పుకొనే రోజు
టీడీపీ వచ్చాకే బీసీలు కీలక నేతలుగా ఎదిగారు
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వెల్లడి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం బీసీల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే అతిపెద్ద నిర్ణయమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఇది కేవలం ఎన్నికల హామీ కాదని, తమ రాజకీయ సిద్ధాంతంలో భాగమని స్పష్టం చేశారు. హామీ ఇవ్వడంతో ఆగకుండా అమలు చేసి చూపిస్తున్నామని తెలిపారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని వెల్లడించారు. బీసీలకు రాజకీయ సాధికారత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాజ్యాంగ పరిమితులను పాటిస్తూ సామాజిక న్యాయం అందించడమే తమ విధానమని స్పష్టం చేశారు. ప్రతి బీసీ కుటుంబం గర్వంగా చెప్పుకునే రోజు ఇదని పేర్కొన్నారు.

టీడీపీతో బీసీలకు రాజకీయ ఎదుగుదల

టీడీపీ ఆవిర్భావానికి ముందు రాజకీయ అధికారం కొన్ని వర్గాలకే పరిమితమైందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే ఆలోచనతో ముందుకు వెళ్లారని చెప్పారు. ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు, తెలంగాణలో దేవేందర్‌గౌడ్ వంటి బీసీ నేతలు ఉన్నత స్థాయికి ఎదగడంలో టీడీపీ కీలక పాత్ర పోషించిందన్నారు. 1995లో బీసీలకు 20 శాతం ఉన్న రిజర్వేషన్లను 34 శాతానికి పెంచామని గుర్తుచేశారు. కులవృత్తులు, చేతివృత్తులకు ఆదరణ అందించామని చెప్పారు. బీసీల కోసం రూ.32 వేల కోట్లు ఖర్చు చేశామని, ఆదరణ పథకం ద్వారా 341 రకాల పరికరాలను 90 శాతం రాయితీతో అందించామని తెలిపారు.

గత పాలనపై చంద్రబాబు విమర్శలు

2019 తర్వాత బీసీలకు రాజకీయంగా అన్యాయం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. 34 శాతం ఉన్న రిజర్వేషన్లు 24.5 శాతానికి తగ్గిపోయాయని, అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై హైకోర్టులో సవాలు జరిగినా సుప్రీంకోర్టును ఆశ్రయించలేదని విమర్శించారు. దీనివల్ల సుమారు 16,800 మంది బీసీ నేతలు రాజకీయ అవకాశాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో గత ప్రభుత్వ వైఖరిని ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు. 2024 ఎన్నికల్లో కూటమికి వచ్చిన భారీ విజయానికి బీసీల మద్దతు కీలక కారణమని చంద్రబాబు చెప్పారు. ఎన్నికలకు ముందే తాను, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు బీసీలకు న్యాయం చేయాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు.

విద్య, ఉపాధితో బీసీల సాధికారత

బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు విద్య, నైపుణ్యం, ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని చంద్రబాబు తెలిపారు. వడ్డెరలకు మైనింగ్ లీజుల్లో 10 శాతం అవకాశాలు, నేతన్న సేవ కింద ప్రతి కుటుంబానికి రూ.25 వేల సాయం, మత్స్యకారులకు అండగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణుల జీతాలను రూ.25 వేలకు పెంచామని, బీసీలు సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు రూ.95 వేల వరకు రాయితీ అందిస్తున్నామని వివరించారు. బీసీ రిజర్వేషన్లు ఎవరికీ వ్యతిరేకం కావని, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టులను ఆశ్రయించే విషయంలోనూ రాజకీయ పార్టీలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

#BCReservation #34PercentBCReservation #AndhraPradesh #ChandrababuNaidu #TDP #BCRights #BCQuota #LocalBodyElections #APLocalElections #BCPoliticalEmpowerment #AndhraPradeshPolitics #TDPGovernment #BCWelfare #SocialJustice #PoliticalRepresentation #LocalElections #APPolitics #Chandrababu #BCLeaders #AndhraPradeshNews