Home AP పారదర్శకతే మా ఆయుధం 148 రోజుల్లో నియామకాలు డీఎస్సీపై లోకేశ్‌ ఫుల్‌ క్లారిటీ!

పారదర్శకతే మా ఆయుధం 148 రోజుల్లో నియామకాలు డీఎస్సీపై లోకేశ్‌ ఫుల్‌ క్లారిటీ!



మెగా డీఎస్సీ నిర్వహణపై వస్తున్న విమర్శలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అసెంబ్లీలో ఘాటుగా సమాధానం ఇచ్చారు. డీఎస్సీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పటిష్టంగా నిర్వహించామని స్పష్టం చేశారు. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించగా, 3,36,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. మొత్తం నియామక ప్రక్రియను కేవలం 148 రోజుల్లో పూర్తి చేశామని చెప్పారు. టెట్‌ను తప్పనిసరి చేయడం, వర్టికల్‌ రిజర్వేషన్లు, హారిజంటల్‌ రిజర్వేషన్లు అమలు చేయడం, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ను పకడ్బందీగా నిర్వహించడం ద్వారా ఎంపికలు చేపట్టామని వివరించారు. పరీక్షను టీసీఎస్‌ ఐయాన్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా నిర్వహించినట్లు తెలిపారు.

42 వేల ప్రశ్నలు.. 336 కేసులు

డీఎస్సీ కోసం 42 వేల ప్రశ్నలను సిద్ధం చేశామని, అభ్యర్థుల ఫిర్యాదులను పరిష్కరించేందుకు పలు స్థాయిల్లో గ్రీవెన్స్‌ వ్యవస్థ ఏర్పాటు చేశామని లోకేశ్‌ చెప్పారు. నియామకాలపై భిన్నాభిప్రాయాలతో 336 కేసులు దాఖలైనా, న్యాయపరమైన అంశాలను ఎదుర్కొంటూ ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన తర్వాత ఉపకులాలను రోస్టర్‌లో సర్దుబాటు చేసి డీఎస్సీ నిర్వహించామని చెప్పారు. స్పోర్ట్స్‌ కోటాను కూడా కేంద్ర నిబంధనలకు అనుగుణంగా 29 కేటగిరీల నుంచి 65 కేటగిరీలకు పెంచామని వివరించారు. గత ప్రభుత్వం 2019–24 మధ్య ఒక్క ఉపాధ్యాయ నియామకం కూడా చేపట్టలేదని విమర్శించిన లోకేశ్‌.. టీడీపీ హయాంలో ఇప్పటివరకు 1.80 లక్షల మంది టీచర్లను నియమించామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు సింగపూర్‌, ఫిన్లాండ్‌లో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.

ఏటా డీఎస్సీ.. వైసీపీకి సవాల్‌

ఇకపై ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని లోకేశ్‌ ప్రకటించారు. డీఎస్సీపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని వైసీపీపై మండిపడ్డారు. ఆరోపణలు నిజమైతే ఆధారాలు చూపించాలని సవాల్‌ చేశారు. సభలో అయినా.. సభ బయట అయినా చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. జగన్‌ సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తూ, తేదీ, సమయం ఖరారు చేస్తే చర్చకు సిద్ధమని అన్నారు. డీఎస్సీ అంటే తెలియని వారే నియామకాలపై మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉందని చెబుతూనే, నియామక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రభుత్వం చెబుతున్న వాదనను లోకేశ్‌ మరోసారి బలంగా వినిపించారు. ఉపాధ్యాయ నియామకాల్లో పారదర్శకతను కొనసాగిస్తూ, విద్యా వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకువస్తామని స్పష్టం చేశారు.

#MegaDSC #DSC2025 #NaraLokesh #APTeacherRecruitment #AndhraPradesh #TeacherJobs #DSCRecruitment #EducationDepartment #APEducation #TeacherRecruitment #DSCExam #RecruitmentTransparency #TCSiON #YSRCP #TDP