ఫిఫా వరల్డ్‌కప్ 2026 లీగ్ మ్యాచ్‌ల ఆరంభం నుంచే అనూహ్య ఫలితాలు నమోదవుతున్నాయి. లాస్ ఏంజెలెస్‌లో జరిగిన గ్రూప్-జి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఇరాన్ 2-2 గోల్స్ తేడాతో డ్రా చేసుకుంది. టోర్నీలో అట్టడుగు ర్యాంకులో ఉన్న న్యూజిలాండ్ ఆటగాడు ఎలిజా జస్ట్ రెండు అద్భుత గోల్స్‌తో ఇరాన్‌కు షాక్ ఇచ్చాడు. ఇరాన్ తరఫున రామిన్ రెజాయియాన్, మహమ్మద్ మొహేబీ చెరో గోల్ చేసి స్కోరును సమం చేశారు. ఈ మ్యాచ్ వ్యాప్తంగా ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనల వేడి కనిపించింది. స్టేడియం వెలుపల నిరసనకారులు ఆందోళన చేయగా, లోపల అభిమానులు పాత ఇరాన్ జెండాలను ప్రదర్శిస్తూ జాతీయ గీతం సమయంలో వెనుదిరిగి నిలబడి తమ నిరసనను వ్యక్తపరిచారు.
బెల్జియం, ఉరుగ్వే జట్లకు తప్పని నిరాశ
సియాటెల్‌లో జరిగిన మరో గ్రూప్-జి పోరులో బలమైన బెల్జియం జట్టు ఈజిప్ట్‌తో 1-1తో డ్రా చేసుకుంది. మ్యాచ్ 19వ నిమిషంలో ఈజిప్ట్ ప్లేయర్ ఎమామ్ అషూర్ గోల్ చేయగా, రెండో అర్ధభాగంలో రొమెలు లుకాకు ఒత్తిడి కారణంగా ఈజిప్ట్ డిఫెండర్ మహ్మద్ హానీ చేసిన ఓన్ గోల్ వల్ల బెల్జియం స్కోరు సమమైంది. అటు మయామిలో జరిగిన గ్రూప్-హెచ్ మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్ ఉరుగ్వే సైతం 1-1తో సౌదీ అరేబియాతో డ్రా కావడం గమనార్హం. సౌదీ డిఫెండర్ అబ్దులెలాహ్ అల్ అమ్రీ మొదట గోల్ చేయగా, మ్యాచ్ 80వ నిమిషంలో మాక్సిమిలియానో అరౌజో గోల్ కొట్టి ఉరుగ్వేను ఓటమి నుండి కాపాడాడు. టోర్నీ తొలి రోజే అగ్రశ్రేణి జట్లు డ్రా పాయింట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.











