Home AP దిగజారిన శాంతిభద్రతలు రౌడీలపై నిఘా ఏదన్న మంత్రి

దిగజారిన శాంతిభద్రతలు రౌడీలపై నిఘా ఏదన్న మంత్రి


హత్యపై పోలీసుల తీరుపై ఆగ్రహం
సీఎంకు ఫిర్యాదు చేస్తానన్న భరత్

కర్నూలు జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ చిన్నచిన్న విషయాలకే రౌడీ మూకలు హత్యలకు పాల్పడుతున్నా పోలీసులు సీరియస్‌గా స్పందించడం లేదని ఆరోపించారు. ఇటీవల టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ బాషా హత్య ఘటనను ప్రస్తావించిన మంత్రి, ఈ ఘటనకు ముందు సోషల్ మీడియాలో హత్యకు సంబంధించిన హెచ్చరికలు దాదాపు వారం రోజుల ముందే కనిపించాయని పేర్కొన్నారు. అలాంటి సమాచారం ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు అప్రమత్తం కాలేదని, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేల కదలికలపై పోలీసులు నిఘా పెట్టడం కంటే అసాంఘిక శక్తుల కార్యకలాపాలను గుర్తించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

సీఎంకు ఫిర్యాదు చేస్తానన్న భరత్

కర్నూలులో రౌడీలు రెచ్చిపోతున్నా పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదని భరత్ విమర్శించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు రౌడీషీటర్లను ఉపయోగించి టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇంతియాజ్ బాషా హత్యకు పోలీసుల నిఘా వైఫల్యమే కారణమని మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్రంగా దృష్టి సారించి అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ప్రజలకు భద్రతపై నమ్మకం కలిగేలా పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా పనిచేయాలని కోరారు. కర్నూలు శాంతిభద్రతల అంశాన్ని త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి, పరిస్థితిపై ఫిర్యాదు చేస్తానని మంత్రి టీజీ భరత్ తెలిపారు.

 

#TGBharat #KurnoolLawAndOrder #KurnoolCrime #KurnoolMurder #AndhraPradeshPolitics #APPolice #LawAndOrder #PoliceSurveillance #RowdyElements #IntiyazBashaMurder #TDPWorkerMurder #AndhraPradeshNews #ChandrababuNaidu #TGBharatNews