Home AP వివేకా హత్య కేసు మరో దర్యాప్తు అవసరం లేదు

వివేకా హత్య కేసు మరో దర్యాప్తు అవసరం లేదు


సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు.
సునీత పిటిషన్‌ కొట్టేసిన న్యాయస్థానం .

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరింత దర్యాప్తు అవసరం లేదని హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. మాజీ మంత్రి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి దాఖలు చేసిన అదనపు దర్యాప్తు పిటిషన్‌ను శుక్రవారం కోర్టు కొట్టివేసింది. ఇప్పటికే సమగ్ర దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సమర్పించిన నివేదికను కోర్టు అంగీకరించింది. కేసులో మరోసారి విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని తీర్పు ఇచ్చింది.

ఎలక్ట్రానిక్ ఆధారాలు.. సీబీఐ నివేదిక

కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి మధ్య హత్య జరిగిన తర్వాత జరిగిన ఫోన్ కాల్స్, సందేశాలు, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను సీబీఐ పూర్తిగా పరిశీలించలేదని సునీతారెడ్డి వాదించారు. ఈ అంశాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2025 డిసెంబరులో కోర్టు ఈ అంశంపై అదనపు దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ సంబంధిత ఆధారాలను మళ్లీ పరిశీలించింది. సాంకేతిక విశ్లేషణ చేపట్టడంతో పాటు సంబంధిత వ్యక్తులను మరోసారి విచారించింది. 2026 మార్చిలో సమర్పించిన అదనపు నివేదికలో అనుమానాస్పదంగా భావించిన సందేశాలు అర్థరాత్రి సమయంలో పంపించలేదని వెల్లడించింది. యూటీసీ సమయం, భారత కాలమానం మధ్య తేడాను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఈ అనుమానం వచ్చిందని వివరించింది. సరైన సమయ మార్పిడి చేసిన తర్వాత ఎలాంటి అనుమానాస్పద అంశాలు కనిపించలేదని పేర్కొంది.

కొత్త ఆధారాలు లేవన్న సీబీఐ

అదనపు దర్యాప్తులో పెద్ద కుట్రకు సంబంధించిన కొత్త ఆధారాలు ఏవీ లభించలేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. కేసులో సాధ్యమైన అన్ని కోణాల్లో ఇప్పటికే దర్యాప్తు పూర్తయిందని స్పష్టం చేసింది. ఈ వాదనలను పరిశీలించిన కోర్టు, సునీతారెడ్డి కోరిన మరో దర్యాప్తు అవసరం లేదని తేల్చింది. వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో హత్యకు గురయ్యారు. తొలుత గుండెపోటుగా ప్రచారం జరిగినా, తర్వాత అది హత్యగా నిర్ధారణ అయింది. కోర్టు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. అనంతరం పలువురిపై అభియోగపత్రం దాఖలు చేసింది. ప్రస్తుతం కేసు విచారణ సీబీఐ ప్రత్యేక కోర్టులో కొనసాగుతోంది. తాజా ఉత్తర్వుతో ఈ కేసులో ఇకపై అదనపు దర్యాప్తు అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.

 

#YSVivekanandaReddy #VivekaMurderCase #SunithaReddy #CBIInvestigation #CBICourt #AndhraPradeshPolitics #CourtVerdict #YSFamily #Pulivendula #PoliticalNews