ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో పర్యటించారు. అక్కడి నవభారత్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సతీమణి భువనేశ్వరితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటలకు హెలికాప్టర్‌లో పాల్వంచకు చేరుకున్న చంద్రబాబు, జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని హెలిప్యాడ్‌లో దిగారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకటరావు, రాందాస్ నాయక్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయానికి చేరుకున్న చంద్రబాబు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
టీడీపీ నేతలకు అనుమతి నిరాకరణ
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే హెలిప్యాడ్ ప్రాంతంలోకి టీడీపీ నాయకులకు సైతం అనుమతి ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన టీడీపీ నేతలు కలెక్టరేట్‌కు వెళ్లే రహదారిపై నిరసన తెలిపారు. ప్రత్యేక పూజలు ముగించుకున్న చంద్రబాబు తిరిగి హెలిప్యాడ్‌కు చేరుకుని హెలికాప్టర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరారు. సీఎం పర్యటన ప్రశాంతంగా ముగిసినా, స్థానిక టీడీపీ నేతలకు ప్రవేశం నిరాకరించడంపై నిరసన వ్యక్తమైంది.
#ChandrababuNaidu #Palvancha #BhadradriKothagudem #Bhuvaneshwari #APCM #SpecialPrayers #VenkateswaraSwamyTemple #TummalaNageswaraRao #TDP #TelanganaVisit #AndhraPradesh











