సుప్రీంకోర్టు ఆదేశాలకు సర్కారు సవాల్!
దీపం వెలిగించడంపై విజయ్ సర్కారు వెనక్కి!
తమిళనాడులోని మధురై తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం వివాదం మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఉచ్చి పిళ్లయార్ ఆలయం సమీపంలోని సంప్రదాయ ప్రాంతంలోనే విజయ్ ప్రభుత్వం దీపం వెలిగించింది. అయితే దర్గాకు సమీపంలోని కొండపై రాతి స్తంభం వద్ద దీపం వెలిగించలేదు. నవంబర్ 20న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం నవంబర్ 24న ఒకసారి అక్కడ దీపం వెలిగించేందుకు అనుమతి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆదేశాలను అమలు చేయకపోవడం వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయానికి కారణాలను ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా వివరించలేదు. ఆలయ సంప్రదాయాలు, ఆగమ నియమాల ప్రకారమే సంప్రదాయ ప్రదేశంలో దీపం వెలిగించినట్లు ఆలయ యాజమాన్యం ప్రకటించింది.
కోర్టు ఆదేశాలు.. రాజకీయ విమర్శలు
మధురై జిల్లా కలెక్టర్‌ను సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు ప్రత్యేక నోడల్ అధికారిగా నియమించినప్పటికీ కొండపై దీపం వెలిగించకపోవడం కీలకంగా మారింది. గతంలో మద్రాస్ హైకోర్టు కూడా సంప్రదాయ ప్రాంతంతో పాటు కొండపై రాతి స్తంభం వద్ద దీపం వెలిగించాలని ఆదేశించింది. అయితే శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటూ అప్పటి డీఎంకే ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదు. ప్రస్తుతం విజయ్ ప్రభుత్వంపైనా అదే తరహా విమర్శలు వస్తున్నాయి. కొండపై రెండు వర్గాల ప్రజలు భారీగా గుమిగూడే అవకాశం ఉందన్న నిఘా సమాచారంతో జిల్లా యంత్రాంగం నిషేధాజ్ఞలు విధించింది. బీజేపీ నేతలు ఎల్. మురుగన్, నైనార్ నాగేంద్రన్లను కూడా అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించలేదని విమర్శించగా, కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ దీపం పేరుతో రాజకీయాలు చేయాలనుకున్నవారు నిరాశ చెందారని వ్యాఖ్యానించారు.
విజయ్ సర్కారుకు రాజకీయ పరీక్ష
ఈ వివాదం విజయ్ ప్రభుత్వానికి రాజకీయంగా సంక్లిష్టంగా మారింది. అసెంబ్లీలో మైనారిటీ ప్రభుత్వంగా కొనసాగుతున్న టీవీకేకు వీసీకే, ఐయూఎంఎల్ వంటి మిత్రపక్షాల మద్దతు అవసరం. కొండపై దీపం వెలిగించడం వల్ల మత సామరస్యం దెబ్బతింటుందన్న ఆందోళనను ఈ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం న్యాయవ్యవస్థ పట్ల ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఏఐఏడీఎంకే, బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించాయి. ప్రభుత్వం మాత్రం స్థానిక హిందూ, ముస్లిం ప్రజల మధ్య సంప్రదాయ ఆచారాల విషయంలో వివాదం లేదని చెబుతోంది. గతంలో 1862, 1912, 1996లోనూ ఈ దీపం వెలిగింపు అంశంపై వివాదాలు తలెత్తాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై ధిక్కార పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం కూడా ఉంది. మత విశ్వాసాలు, శాంతిభద్రతలు, న్యాయస్థానం ఆదేశాలు.. ఈ మూడింటి మధ్య విజయ్ ప్రభుత్వం ఎటువైపు నిలుస్తుంది? ఇదే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అత్యంత కీలక ప్రశ్న!
#Tirupparankundram #KarthigaiDeepam #VijayGovernment #TamilNaduPolitics #SupremeCourt #Madurai #DeepamControversy #BJP #ReligiousTraditions











