Home Telangana ఇక్కత్‌ అల్లిక.. ఇప్పపూల తీపి!

ఇక్కత్‌ అల్లిక.. ఇప్పపూల తీపి!

ఢిల్లీ మేళాలో తెలంగాణ కళలు, ఉత్పత్తుల సందడి.
సంప్రదాయ చేనేతకు ఆధునిక హంగులు.

ఢిల్లీల్లీలోని భారత్‌ మండపంలో జరుగుతున్న 45వ భారత అంతర్జాతీయ వాణిజ్య మేళా (ఐఐటీఎఫ్‌)లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాల నుంచి దేవరకొండ గిరిజన ఆభరణాల వరకు, హైదరాబాద్‌ ముత్యాల నుంచి ఇప్పపూల లడ్డూల వరకు రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాల ప్రత్యేక ఉత్పత్తులు ఒకే వేదికపై సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. గద్వాల, నారాయణపేట చీరలు, వరంగల్‌ చేనేత తివాచీలు, కలంకారీ ఉత్పత్తులు, హైదరాబాద్‌ లక్క గాజులు తెలంగాణ పవిలియన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు.

గ్రామీణ ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు
సంప్రదాయ ఇక్కత్‌ వస్త్రాలతో ఆధునిక డిజైన్లలో రూపొందించిన బ్యాగులతో పాటు చిన్న పరిశ్రమల ఉత్పత్తులనూ ప్రదర్శనకు తీసుకొచ్చారు. సెర్ప్‌ ఎంపిక చేసిన స్టాళ్లలో గిరిజన సంప్రదాయ ఆహార పదార్థాలు, సేంద్రియ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పపూలతో తయారు చేసిన లడ్డూలు, చిరుధాన్యాల బిస్కెట్లు, ఇతర చిరుధాన్యాల చిరుతిళ్లు సందర్శకుల ఆసక్తిని పెంచుతున్నాయి. ఆదిలాబాద్‌లో చేతితో తయారు చేసిన సేంద్రియ అగరుబత్తులకూ ప్రదర్శనలో చోటు కల్పించారు.

చేనేత కార్మికులకు కొత్త మార్కెట్లు
భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ (ఐటీపీఓ) ఏటా నిర్వహించే ఈ మేళా దేశంలోని ప్రధాన వాణిజ్య ప్రదర్శనల్లో ఒకటి. ‘వికాస్‌ ఔర్‌ విరాసత్‌’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ ఏడాది మేళాలో 11 దేశాలు పాల్గొంటున్నాయి. 3,500 మందికి పైగా ప్రదర్శకులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. చేనేత కార్మికులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఇతర ప్రాంతాల కొనుగోలుదారులను నేరుగా కలుసుకునేందుకు ఈ మేళా అవకాశం కల్పిస్తోంది. తమ ఉత్పత్తులకు కొత్త మార్కెట్లను పరిచయం చేసుకునే వేదికగా నిలుస్తోంది. ఈ ప్రదర్శన నవంబరు 27 వరకు కొనసాగనుంది.

కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మార్గదర్శకత్వంలో వాణిజ్య, ఎగుమతి ప్రోత్సాహక విభాగం ఈ ఏర్పాట్లు చేసింది. చేతివృత్తుల కళాకారులు, చేనేత కార్మికులు, స్వయం సహాయక సంఘాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు స్టాళ్లు కేటాయించారు. తెలంగాణ పవిలియన్‌ నోడల్‌ అధికారి, వాణిజ్య, ఎగుమతి ప్రోత్సాహక విభాగం ఉప సంచాలకుడు సుధిన్‌ పాల్‌ ఏర్పాట్లతో పాటు రోజువారీ నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు.

క్యూఆర్‌ కోడ్‌తో పెట్టుబడుల సదస్సుకు నమోదు
తెలంగాణ పవిలియన్‌లో ఏర్పాటు చేసిన ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026’ సమాచార స్టాండీలు కూడా సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. డిసెంబరు 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఈ సదస్సు జరగనుంది. సదస్సుకు సంబంధించిన వివరాలను స్టాండీలపై పొందుపరిచారు. ఆసక్తి ఉన్నవారు అక్కడ ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను అంతర్జాతీయ వేదికపై పరిచయం చేయడంలో ఈ ప్రచారం కీలకంగా నిలుస్తోంది.

 

#Telangana #IITF2026 #IndiaInternationalTradeFair #PochampallyIkat #GadwalSarees #TelanganaHandlooms #TelanganaCulture #TribalProducts #HyderabadPearls #InvestTelangana