Home Cinema_News టాలీవుడ్‌లో రోషన్ పాన్ ఇండియా మూవీ

టాలీవుడ్‌లో రోషన్ పాన్ ఇండియా మూవీ

ఇంద్రగంటి దర్శకత్వంలో కొత్త అవతారం!

టాలీవుడ్‌లో మరో సరికొత్త సూపర్‌హీరో ప్రయాణానికి తెరలేచింది! హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా ఇప్పుడు వెండితెరపై సూపర్‌హీరోగా అవతరించబోతున్నారు. ‘పెళ్లి సందడి’, ‘ఛాంపియన్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన రోషన్, ప్రస్తుతం ‘ఏమో ఏమో ఇది’ విడుదలకు సిద్ధమవుతుండగానే మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. విలక్షణ ప్రేమకథలతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి ఈసారి సరికొత్త సూపర్‌హీరో ప్రపంచాన్ని సృష్టించేందుకు సిద్ధమయ్యారు. అశోక్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నంబర్ 3ను నిర్మాతలు అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు బుధవారం సంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘కొత్త సూపర్‌హీరో ప్రపంచం ప్రాణం పోసుకుంటోంది.. ప్రపంచం ఓ సరికొత్త సూపర్‌హీరో కోసం ఎదురుచూస్తోంది’ అంటూ మేకర్స్ ప్రకటించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. శ్రీకాంత్ క్లాప్ కొట్టగా, ముప్పా వెంకయ్య చౌదరి కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్రబృందానికి స్క్రిప్ట్ అందించారు. రోషన్ సరసన రేఖా పాండే, వినయ్ రాయ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. పీజీ విందా కెమెరా బాధ్యతలు చేపట్టగా, గౌర హరి సంగీతం అందించనున్నారు. అంతర్జాతీయ కొరియోగ్రాఫర్ లీ విటేకర్, రామకృష్ణ ఆధ్వర్యంలో హైఎండ్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కనున్నాయి. డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభించి, 2027 ద్వితీయార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విజువల్ వండర్‌గా రూపొందనున్న ఈ చిత్రం రోషన్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుగా నిలవనుందనే అంచనాలు నెలకొన్నాయి.

 

#RoshanMeka #MohanaKrishnaIndraganti #SuperheroMovie #PanIndiaMovie #Tollywood #AshokaCreations #Srikanth #RekhaPandey #VinayRai #GowraHari #TeluguCinema #UpcomingMovies