ప్రభుత్వ భూముల వేలంపై ఈటల రాజేందర్ ఆగ్రహం.
కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాలను వేలం వేయడంపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేపీహెచ్‌బీ కాలనీలోని ఫోరం మాల్ ఎదురుగా నిర్వహించిన ధర్నాలో పాల్గొని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. “భూమి నీ అబ్బజాగీరు కాదు.. కూకట్‌పల్లిలో భూములు అమ్మకు” అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ముఖ్యమంత్రే భూములు అమ్ముతున్నారని, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా వ్యవహరిస్తోందని విమర్శించారు. చిన్నచిన్న ప్లాట్లను కూడా వేలం వేయడం ఏమిటని ప్రశ్నించారు. భూములను కాపాడలేక అమ్ముతున్నామని చెప్పడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. “నీవు ప్రగతిశీల ముఖ్యమంత్రివా? ప్రజలను ఇబ్బంది పెట్టడానికే ఉన్నావా?” అంటూ నిలదీశారు.
పెరుగుతున్న జనాభా.. తగ్గుతున్న ప్రజా స్థలాలు!
కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఆసియాలోనే అతిపెద్ద కాలనీల్లో ఒకటని, పేదలకు ఇళ్లు నిర్మించేందుకు రైతుల నుంచి భూములు సేకరించారని ఈటల గుర్తుచేశారు. ఇక్కడ ఇప్పటికే జనసాంద్రత అధికంగా ఉందని, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కొరత ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ జనాభా 30 లక్షల నుంచి కోటి 70 లక్షలకు పెరిగిందని చెబుతూ, ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు ఆటస్థలాలు, ప్రజలకు పార్కులు, గుడులు, బడుల కోసం కేటాయించిన స్థలాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. వాటిని విక్రయిస్తే భవిష్యత్తులో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. పిల్లలు సెల్‌ఫోన్లు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలంటే ఆటస్థలాలు అవసరమని చెప్పారు.
రేవంత్‌కు ఈటల హెచ్చరిక.. ప్రజల ఆవేదన గుర్తించాలి!
ఒకవైపు ప్రభుత్వ భూములను కాపాడేందుకు సుప్రీంకోర్టులో పోరాడుతున్నామని చెబుతూ, మరోవైపు కూకట్‌పల్లిలో ప్లాట్లు అమ్మడం ఏమిటని ఈటల ప్రశ్నించారు. భూముల కబ్జాల వెనుక నాయకులు, అధికారులు, కబ్జాదారుల కుమ్మక్కు ఉందన్న ఆరోపణలు చేశారు. గండిపేట, హైటెక్‌సిటీ, నానక్‌రామ్‌గూడలో భూముల విక్రయాలను తాము అడ్డుకోవడం లేదని, అత్యధిక జనసాంద్రత ఉన్న కూకట్‌పల్లిలో ప్రజా అవసరాల స్థలాలను మాత్రమే కాపాడాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. ఈ ధర్నాను బీజేపీ రాజకీయ కార్యక్రమంగా చూడకుండా ప్రజల ఆవేదనగా గుర్తించాలని రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగితే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్‌రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
#EtelaRajender #Kukatpally #KPHBColony #LandAuction #GovernmentLands #RevanthReddy #TelanganaGovernment #BJP #BJPTelangana #Hyderabad #PublicUtilityLands #SavePublicLands #TelanganaPolitics











