Home AP పోఖ్రాన్ వ్యూహమే.. పొలాల్లోనూ!

పోఖ్రాన్ వ్యూహమే.. పొలాల్లోనూ!

ఉపగ్రహాల కళ్లుగప్పి పంట వ్యర్థాల దహనం!
శాటిలైట్ల నిఘాకు రైతుల సరికొత్త ఎత్తుగడలు.

1998లో పోఖ్రాన్ అణు పరీక్షల సమయంలో అమెరికా గూఢచారి ఉపగ్రహాల నిఘాను తప్పించుకునేందుకు భారత శాస్త్రవేత్తలు అనుసరించిన వ్యూహం ఇప్పుడు మరో రూపంలో కనిపిస్తోంది. అప్పట్లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేతృత్వంలోని శాస్త్రవేత్తలు ఐదు అణు పరీక్షల ఏర్పాట్లను అత్యంత రహస్యంగా నిర్వహించారు. ఇప్పుడు పంజాబ్, హర్యానా రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టే విషయంలో ఉపగ్రహాల నిఘా సమయాలను గమనిస్తూ కొత్త పద్ధతులు అనుసరిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఉపగ్రహాలు నిర్దిష్ట సమయాల్లో మాత్రమే పొలాలను పరిశీలిస్తాయన్న విషయాన్ని గుర్తించిన రైతులు, ఆ సమయాల మధ్యలో మంటలు పెడుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో అనేక అగ్నిప్రమాదాలు అధికారిక లెక్కల్లోకి రావడం లేదని పర్యావరణ నిపుణులు భావిస్తున్నారు.

తగ్గిన మంటలు.. పెరిగిన అనుమానాలు!

2021లో దేశవ్యాప్తంగా దాదాపు 80 వేల వరకు నమోదైన పంట వ్యర్థాల దహనం ఘటనలు 2025 నాటికి సుమారు 6 వేలకు తగ్గాయి. జరిమానాలు, ప్రభుత్వ నిబంధనలు, వ్యవసాయ యంత్రాలపై రాయితీలు, అవగాహన కార్యక్రమాలు ఈ తగ్గుదలకు కారణమయ్యాయి. అయితే ఉపగ్రహాల పరిశీలన సమయాలను రైతులు అర్థం చేసుకోవడం కూడా అధికారిక లెక్కలు తగ్గడానికి ఒక కారణమై ఉండవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నాసా నిర్వహించే మోడీస్, వీర్స్ వ్యవస్థలతో కూడిన నాలుగు ఉపగ్రహాలు ప్రధానంగా పంట మంటలను గుర్తిస్తున్నాయి. కానీ ఇవి రోజులో కొన్ని సమయాల్లో మాత్రమే ఒక ప్రాంతాన్ని పరిశీలిస్తాయి. ఈ లోపాన్ని అధిగమించేందుకు ఐఫారెస్ట్ సంస్థ ఫైర్ వాచ్ అనే కొత్త పర్యవేక్షణ వేదికను ప్రారంభించింది. ఇది మూడీస్, వీర్స్‌తో పాటు మెటోశాట్-8, 9 ఉపగ్రహాల సమాచారాన్ని సమన్వయం చేస్తుంది. ఇవి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి చిత్రాలను అందిస్తాయి. సెంటినల్-2 చిత్రాలతో కాలానికి ముందు, తర్వాత భూమిలో వచ్చిన మార్పులను పరిశీలించి కాలిపోయిన వ్యవసాయ భూమి విస్తీర్ణాన్ని కూడా అంచనా వేస్తారు.

నిరంతర నిఘాకు భారత్ సిద్ధం!

ఉపగ్రహాల పరిశీలనలో సమయ పరిమితులను అధిగమించేందుకు భారత పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా కీలక సూచనలు చేసింది. అటవీ మంటలు, పర్యావరణ మార్పులను నిరంతరం గుర్తించగల భౌగోళిక స్థిర ఉపగ్రహ వ్యవస్థను అభివృద్ధి చేయాలని అంతరిక్ష శాఖను కోరింది. ఈ దిశగా ఈవోఎస్-05 కీలక ముందడుగుగా నిలుస్తోంది. ఇది ఎంపిక చేసిన ప్రాంతాలను ప్రతి ఐదు నిమిషాలకు, మేఘాలు అడ్డురాని పరిస్థితుల్లో మొత్తం భారత భూభాగాన్ని ప్రతి 30 నిమిషాలకు పరిశీలించగలదు. అయితే ప్రస్తుతం ఈ ఉపగ్రహం పరీక్షల దశలోనే ఉంది. రక్షణపరమైన అంశాల కారణంగా దాని సమాచారంపై పౌర పర్యావరణ సంస్థలకు పూర్తి స్థాయి అందుబాటు కూడా లేదు. మరోవైపు హైదరాబాద్‌లోని జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం కార్టోశాట్-3 చిత్రాల ద్వారా కాలిపోయిన వ్యవసాయ భూములను గుర్తిస్తోంది. మంటలు కనిపించకపోయినా, కాలిన నేల ఆనవాళ్లు మాత్రం దాచలేరు. ఈ వివరాలను వాయు నాణ్యత నిర్వహణ కమిషన్‌కు అందిస్తున్నారు. దీంతో పంట వ్యర్థాల దహనంపై రైతుల వ్యూహాలు, ఉపగ్రహాల నిఘా మధ్య కొత్త పోరు మొదలైంది.

 

#StubbleBurning, #PunjabFarmers, #HaryanaFarmers, #SatelliteSurveillance, #CropResidueBurning, #NASA, #MODIS, #VIIRS, #FireWatch, #iFOREST, #EOS05, #Cartosat3, #AirPollution, #NRSC