ఫిర్యాదుపై మూడు రోజుల్లో తనిఖీలు
15 రోజులకు ఒకసారి టాస్క్‌ఫోర్స్ సమీక్ష
శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ
ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ ఇసుక తవ్వకాలు, ఖనిజాల రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ఉత్తర్వుల ప్రకారం గనులు, రెవెన్యూ, పోలీసు, అటవీ, జలవనరులు, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయనున్నాయి. అక్టోబర్ 1న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో నవంబర్ 3న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి కార్యాచరణ ఖరారు చేశారు. గత రెండేళ్లలో ఇసుక అక్రమాలపై 2,113 కేసులు, రూ.6.24 కోట్ల జరిమానాలు, 21 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 117 వాహనాలను బ్లాక్‌లిస్ట్ చేశారు. చిన్న ఖనిజాల అక్రమాలపై 9,120 కేసులు నమోదు చేసి రూ.340.9 కోట్ల జరిమానాలు విధించారు. మీడియా, హెల్ప్‌లైన్, విజిలెన్స్ యాప్, ప్రజల ఫిర్యాదులను ప్రత్యేక కేసు నంబర్లతో నమోదు చేయనున్నారు. ఫిర్యాదు అందిన మూడు పని దినాల్లో భూమి వివరాలు సేకరించి, సంబంధిత శాఖలు సంయుక్త తనిఖీలు నిర్వహించి నివేదిక ఇవ్వాలి.
అక్రమార్కులకు జరిమానాలు, అధికారులకూ బాధ్యత
అక్రమ తవ్వకాలు నిర్ధారణైతే ఖనిజాల పరిమాణం, ప్రభుత్వ ఆదాయ నష్టాన్ని అంచనా వేసి జరిమానాలు విధిస్తారు. అక్రమ రవాణా వాహనాలను స్వాధీనం చేసుకుని బ్లాక్‌లిస్ట్ చేయడంతో పాటు నిందితులపై కేసులు నమోదు చేస్తారు. చెల్లించని జరిమానాలను రెవెన్యూ రికవరీ చట్టం కింద వసూలు చేస్తారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల అక్రమాలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. తనిఖీలకు పోలీసు రక్షణ కల్పించాలని ఎస్పీలకు సూచించారు. ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుచేసి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించనున్నారు. 30 రోజుల్లో ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్, డ్యాష్‌బోర్డు అందుబాటులోకి తీసుకురానున్నారు. శాఖలు 15 రోజుల్లో సూచనలు సమర్పించాలి. నవంబర్ నెలాఖరులో మరోసారి సమావేశమై సమగ్ర మార్గదర్శకాలు రూపొందించనున్నారు. కలెక్టర్లు, ఎస్పీలు ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
#IllegalSandMining #APSandMining #AndhraPradesh #APGovernment #MiningEnforcement #IllegalMining #MineralTransportation #DistrictTaskForce #GSaiPrasad #APHighCourt #MiningPenalties #APNews











