చెత్తకు చెక్.. ట్రాఫిక్‌కు బ్రేక్!
హైదరాబాద్‌పై సీఎం రివ్యూ
హైదరాబాద్‌ను పరిశుభ్రమైన నగరంగా, ట్రాఫిక్ సమస్యలు లేని మహానగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జూబ్లీహిల్స్ నివాసంలో మున్సిపల్ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో నగర పారిశుద్ధ్యం, రవాణా సమస్యలు, నీటి వినియోగంపై కీలక సూచనలు చేశారు. నగరంలోని ఏ ప్రాంతంలోనూ చెత్త పేరుకుపోకూడదని, ప్రతి ఇంటి నుంచి ప్రతిరోజూ చెత్త సేకరించాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం చూపే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. నిర్మాణ వ్యర్థాల తొలగింపునకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని, పారిశ్రామిక ప్రాంతాల్లో చెత్త సేకరణకు ఐలా అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
తాగునీటికి బదులు గ్రీన్ వాటర్
నగరంలో నిర్మాణ పనులు, పార్కుల నిర్వహణ, గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్ అవసరాలకు తాగునీటిని వినియోగించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని సీఎం సూచించారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసిన నీటిని గ్రీన్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని చెప్పారు. జలమండలి ఇప్పటికే 19 ఎస్టీపీల నుంచి 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్లతో సేవలు ప్రారంభించిందని గుర్తుచేశారు. ఈ సేవలపై నిర్మాణ సంస్థలు, పార్కుల నిర్వహణ బాధ్యతలు చేపట్టే సంస్థలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్, ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోనూ గ్రీన్ వాటర్ సరఫరాను విస్తరించాలని సూచించారు. దీనివల్ల తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు.
సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ నిలవొద్దు
హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వాహనాల రాకపోకలు నిరంతరాయంగా సాగేందుకు ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సిగ్నల్ ఫ్రీ ప్రయాణానికి అవసరమైన చోట అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో సిగ్నళ్ల వద్ద వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నగర అభివృద్ధికి అనుగుణంగా రహదారులపై రద్దీని తగ్గించే మార్గాలను గుర్తించాలని సూచించారు.
అధికారులకు సీఎం దిశానిర్దేశం
పారిశుద్ధ్యం, నీటి నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ అంశాల్లో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేవలం ప్రణాళికలు రూపొందించడమే కాకుండా క్షేత్రస్థాయిలో వాటి అమలును నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హైదరాబాద్‌ను పరిశుభ్రతతో పాటు మెరుగైన రవాణా సౌకర్యాలు కలిగిన నగరంగా మార్చడమే లక్ష్యమని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన తదితర అధికారులు పాల్గొన్నారు.
#RevanthReddy #Hyderabad #CleanCity #TrafficFreeHyderabad #HyderabadTraffic #TelanganaGovernment #GHMC #GreenWater #WasteManagement #UrbanDevelopment #SignalFreeTraffic #ElevatedCorridors #Cyberabad











