Home AP 2024 ఎన్నికల్లో అక్రమాలు 13.3 కోట్ల ఓట్ల తొలగించారు

2024 ఎన్నికల్లో అక్రమాలు 13.3 కోట్ల ఓట్ల తొలగించారు

ఎన్నిక చెల్లుబాటు కాదు.
ఈసీపై రాహుల్ ఆరోపణలు.

దేశ రాజకీయాల్లో ఎన్నికల సంఘం వ్యవహారం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై ఇండియా కూటమి చేపట్టిన మాక్ ప్రజాభిశంసన కార్యక్రమంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు 13.3 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించడం ప్రజాస్వామ్య ప్రక్రియ విశ్వసనీయతను దెబ్బతీసిందని అన్నారు. ప్రతిపక్ష కూటమికి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మధ్య నమోదైన ఓట్ల తేడా కంటే తొలగించిన ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఈ తొలగింపుల ప్రభావంపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

ఆరు అభియోగాలు.. ఈసీపై ఆగ్రహం

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్ కుమార్‌పై ఆరు ప్రధాన ఆరోపణలు చేశారు. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడం, 13.2 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించడం, పార్లమెంట్ పర్యవేక్షణ లేకుండా ఫామ్-6 నిబంధనలు మార్చడం వాటిలో ముఖ్యమైనవి. ఈసీనెట్ ద్వారా ఓటర్ల జాబితాలపై నియంత్రణ సాధించడం, మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లను కీలక నిర్ణయాలకు దూరంగా ఉంచడం, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడం కూడా ఆరోపణల్లో ఉన్నాయి. ఈసీ స్వతంత్రతను కాపాడాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించాలని ఇండియా కూటమి డిమాండ్ చేసింది.

నేడు రాంలీలా మైదానంలో రణభేరి

ప్రతీకాత్మక ప్రజాభిశంసన కార్యక్రమానికి మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షత వహించారు. ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. నేడు ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభకు ఇండియా కూటమి సిద్ధమైంది. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓట్ల చోరీకి అడ్డుకట్ట, రాజ్యాంగ రక్షణ లక్ష్యాలుగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు రాహుల్ ప్రకటించారు. అభిజీత్ దీప్కే స్థాపించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కూడా ఈ సభకు మద్దతు ప్రకటించింది. ఎన్నికల సంఘంపై విపక్షాల పోరాటం ఇప్పుడు దేశవ్యాప్త రాజకీయ చర్చగా మారుతోంది.

 

#RahulGandhi #ElectionCommission #GyaneshKumar #VoterDeletion #LokSabhaElections2024 #MallikarjunKharge #INDIABloc #ElectionReforms #ElectoralTransparency #IndianDemocracy #RamlilaMaidan