Home National_news ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అంతమైతేనే శాంతి!

ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అంతమైతేనే శాంతి!

ఏఐసీసీ చీఫ్ ఖర్గే వ్యాఖ్యలతో కొత్త పంచాయితీ .

భారతదేశంలో శాశ్వత శాంతి నెలకొనాలంటే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అంతం చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజా వ్యతిరేక శక్తులని ఆరోపించారు. అలాంటి సిద్ధాంతం కొనసాగుతున్నంతకాలం దేశంలో ఐక్యత సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆదివారం బిహార్‌లోని పాట్నాలో తొలి ముఖ్యమంత్రి శ్రీకృష్ణ సింగ్ 139వ జయంతి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

ఎస్ఐఆర్‌పై రెండో స్వాతంత్ర్య పోరాటం

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను ఖర్గే రెండో స్వాతంత్ర్య పోరాటంగా అభివర్ణించారు. ఈ ఉద్యమానికి బిహార్ ప్రజలు మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. బీజేపీ, ఎన్నికల సంఘం మధ్య సంబంధాలపై ఆరోపణలు చేస్తూ, ఆ పార్టీ సూచనల మేరకు ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీరుపైనా ప్రశ్నలు లేవనెత్తారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు 14 సందర్భాల్లో అభ్యంతరాలు తెలిపినా పట్టించుకోలేదని పేర్కొన్నారు.

దళితులపై వివక్ష కొనసాగుతోందని ఆరోపణ

బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంటరానితనాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఖర్గే ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడిచినా దేశంలో కుల వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హల్ద్వానీలో తాను వెళ్లిపోయిన తర్వాత వేదికపై శుద్ధి కార్యక్రమం నిర్వహించారని ఆరోపించారు. దేశ జనాభాలో పెద్ద భాగాన్ని తమవారిగా గుర్తించకపోతే జాతీయ ఐక్యత ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రామమందిరం కానుకలతో పాటు ఓట్లను కూడా దొంగిలిస్తున్నారని వ్యాఖ్యానించారు.

హామీలపై నిలదీత.. కేంద్రంపై విమర్శలు

నల్లధనాన్ని వంద రోజుల్లో వెనక్కి తెస్తామన్న హామీ, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న వాగ్దానం ఏమైందని ఖర్గే ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, హర్యానా, బిహార్, మహారాష్ట్రల్లో ఓట్ల చోరీతో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుందని విమర్శించారు. ప్రధాని మోదీ, అమిత్ షా తమ ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు ఎదురైనప్పుడు రాహుల్ గాంధీ పేరును ప్రస్తావిస్తున్నారని అన్నారు. ఎన్నికల సంఘంలో తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించి ఓట్ల అక్రమాలకు పాల్పడుతున్నారని అమిత్ షాపై కూడా ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలతో బీజేపీ–కాంగ్రెస్ మధ్య రాజకీయ విభేదాలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి.

#MallikarjunKharge #RSS #Congress #BJP #SIR #VoterListRevision #ElectionCommission #BiharPolitics #Patna #RahulGandhi #AmitShah #VoteTheftAllegations #IndianPolitics #PoliticalControversy