Home AP బొత్స కుటుంబానికి షాక్‌! చైతన్య నామినేషన్‌ తిరస్కరణ

బొత్స కుటుంబానికి షాక్‌! చైతన్య నామినేషన్‌ తిరస్కరణ

జడ్పీ పీఠంపై పెరిగిన పోటీ
పూసపాటిరేగలో తొలి ఎదురుదెబ్బ

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుటుంబానికి జడ్పీటీసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన సోదరుడి కుమారుడు బొత్స చైతన్య పూసపాటిరేగ జడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ తరఫున దాఖలు చేసిన నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత చైతన్య తన ఓటును బదిలీ చేసుకున్నారని జనసేన అభ్యర్థి కోట్ల రేవతి ఫిర్యాదు చేయడంతో అధికారులు పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌, న్యాయవాదులు జిల్లా కలెక్టర్‌కు అప్పీల్‌ చేశారు. ఈ నిర్ణయంపై అప్పీల్‌ ఫలితం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కుటుంబ సభ్యుల బరిలో రాజకీయ లెక్కలు

జిల్లాలో పార్టీ పట్టును నిలబెట్టుకునే ప్రయత్నంలో బొత్స కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన కుమార్తె బొత్స అనూష బొండపల్లి నుంచి, కోడలు బొత్స పూజిత గరివిడి నుంచి, సోదరి లక్ష్మి గుర్ల నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు, మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరి సహస్ర కొత్తవలస, తెర్లాం జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయడం జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. విజయనగరం మేయర్‌ పదవిపై ఆశలు నెరవేరని నేపథ్యంలో సహస్ర రాజకీయ ప్రవేశం ప్రాధాన్యం సంతరించుకుంది. మజ్జి శ్రీనివాసరావు టీడీపీలో చేరిన తర్వాత బొత్స కుటుంబం జిల్లాలో తన బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. వైఎస్సార్‌సీపీకి అభ్యర్థులు దొరకక కుటుంబ సభ్యులను బరిలోకి దించారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

 

#BotsaSatyanarayana #BotsaChaitanya #BotsaFamily #Pusapatirega #ZPTCElections #VizianagaramPolitics #YSRCP #JanaSena #NominationRejected #AndhraPradeshPolitics #LocalBodyElections #PoliticalNews