Home AP సహస్ర ఎంట్రీతో టీడీపీలో కొత్త ట్విస్ట్‌!

సహస్ర ఎంట్రీతో టీడీపీలో కొత్త ట్విస్ట్‌!

రెండు జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు.
జెడ్పీ పీఠంపై ఆశావహుల్లో గుబులు.
కార్పొరేషన్‌ నుంచి జెడ్పీటీసీ బరిలోకి!

విజయనగరం జిల్లా రాజకీయాల్లో మాజీ జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అలియాస్‌ చిన్నశ్రీను కుమార్తె సిరి సహస్ర నామినేషన్లు కొత్త చర్చకు తెరలేపాయి. నగర మేయర్‌ పదవిపై ఆశలు నెరవేరకపోవడంతో ఆమె రాజకీయంగా వెనక్కి తగ్గుతారని భావించిన తరుణంలో, అక్టోబర్‌ 23న కొత్తవలస, తెర్లాం జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల టీడీపీలో చేరిన చిన్నశ్రీను వెంట బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కూడా నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు స్థానాల్లో ఒకదాని నుంచి సహస్ర నామినేషన్‌ ఉపసంహరించుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ పరిణామం జడ్పీ చైర్మన్‌ పదవిపై ఆశలు పెట్టుకున్న నేతల్లో కొత్త సమీకరణాలపై చర్చకు దారితీసింది.

కంది కుటుంబం ఆశలకు కొత్త చిక్కా?

గతంలో ఎంపీ టికెట్‌ దక్కలేదనే ప్రచారంలో ఉన్న టీడీపీ నేత కంది చంద్రశేఖర్‌ తన భార్య రమాదేవిని డెంకాడ జడ్పీటీసీ స్థానానికి పోటీకి దించారు. గెలిస్తే జెడ్పీ చైర్మన్‌ పదవి తమ కుటుంబానికి దక్కుతుందనే ఆశలు పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు కూడా చాలాకాలంగా నెల్లిమర్ల టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. 2019లో పతివాడ నారాయణస్వామి నాయుడుకు, 2024లో జనసేన అభ్యర్థి మాధవికి అవకాశం దక్కడంతో ఆయనకు నిరాశ ఎదురైంది. ఈసారి బీసీ మహిళ రిజర్వేషన్‌ నేపథ్యంలో తన కుమార్తె చంద్రకళను భోగాపురం జడ్పీటీసీ బరిలో నిలిపారు. జడ్పీ చైర్మన్‌ పదవిపై ఆయన ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో సహస్ర నామినేషన్లు కొత్త చర్చకు కారణమయ్యాయి.

బొత్సతో విభేదాల చర్చ.. పాత రాజకీయాలు!

జిల్లా రాజకీయాల్లో చిన్నశ్రీను ప్రాబల్యం, సీనియర్‌ నేతల మధ్య సంబంధాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. గతంలో చిన్నశ్రీనుపై విమర్శలు చేసిన కొందరు నేతలు ఇప్పుడు ఆయన కుటుంబంతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందా అన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న. బొత్స సత్యనారాయణతో ఉన్నట్లు చెప్పబడుతున్న విభేదాలు, జిల్లాలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఈ పరిణామాలకు మరింత ఆసక్తి పెంచుతున్నాయి. సహస్ర రెండు చోట్ల నామినేషన్లు వేయడం వ్యూహాత్మక అడుగా, తుది పోటీకి ముందు రాజకీయ బేరసారాలకు అవకాశమా అన్నది ఆమె తదుపరి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

 

#SiriSahasra #ChinnaSrinu #VizianagaramPolitics #TDP #ZPTCElections #Kothavalasa #Terlam #ZillaParishad #AndhraPradeshPolitics #KandiChandrasekhar #KarrothuBangarraju #BotsaSatyanarayana #PoliticalNews