Home AP కూటమి సీట్ల పంచాయితీ! బాబు–పవన్‌ వరుస భేటీలు

కూటమి సీట్ల పంచాయితీ! బాబు–పవన్‌ వరుస భేటీలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేళ అధికార కూటమిలో సీట్ల సర్దుబాటు చర్చలు కీలకంగా మారాయి. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ శుక్రవారం మరోసారి సమావేశమయ్యారు. చంద్రబాబు నివాసంలో సుమారు జరిగిన ఈ భేటీలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల పంపకంపై చర్చించినట్లు సమాచారం. రెండు రోజుల వ్యవధిలో మరోసారి ఇరువురు నేతలు సమావేశం కావడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలపై టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఇంకా స్పష్టమైన అవగాహన కుదరకపోవడంతో ఆశావహులు తమకు అవకాశముందని భావించిన చోట్ల నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ పరిస్థితికి పరిష్కారం చూపి, మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించడమే నేతల ముందున్న ప్రధాన సవాలుగా కనిపిస్తోంది.

నామినేషన్లతో పెరిగిన పోటీ

సీట్ల పంపకంపై అధికారిక నిర్ణయం వెలువడకపోవడంతో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో గురువారం కూడా చంద్రబాబు, పవన్‌ చర్చలు జరిపారు. నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు అవకాశం కల్పించాలన్న ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. తొలుత అక్టోబర్‌ 28న జరగాల్సిన మున్సిపల్‌ ఎన్నికలను నవంబర్‌ 1కి వాయిదా వేసి, నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో నామినేషన్ల గడువును పొడిగించింది. ఇప్పటికే 100 పట్టణ స్థానిక సంస్థల్లో సీట్ల పంపకంపై ఎన్డీయే భాగస్వాములు ఒప్పందానికి వచ్చారు. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల విషయంలోనూ అదే తరహా ఏకాభిప్రాయం కుదురుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది

 

#AndhraPradeshPolitics #ChandrababuNaidu #PawanKalyan #TDP #JanaSena #BJP #SeatSharing #MPTCElections #ZPTCElections #APLocalElections #NDA