Home Telangana గ్లోబల్ సమ్మిట్‌.. జట్ స్పీడ్‌!

గ్లోబల్ సమ్మిట్‌.. జట్ స్పీడ్‌!

ఫ్యూచర్ సిటీపై సీఎం ఫోకస్‌.
గడువుకు ముందే పనులు పూర్తి.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాట్లు .

తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా నిలబెట్టే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఫ్యూచర్‌ సిటీపై ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో పర్యటించిన ఆయన యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించారు. డిసెంబర్‌ 7 నుంచి 9 వరకు జరగనున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ 2026’కు అంతర్జాతీయ స్థాయి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ, విదేశాల పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేలా సదస్సు ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు.

గడువుకు ముందే నిర్మాణాలు పూర్తి చేయాలి

స్కిల్స్‌ యూనివర్సిటీ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సీఎం సూచించారు. నిర్దేశిత గడువుకు 15 రోజుల ముందుగానే పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. బహిరంగ ప్రాంగణ పనులను నవంబరు 15లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమ్మిట్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నవంబరు నెలాఖరులోగా సిద్ధం చేయాలని అధికారులకు గడువు విధించారు.

తెలంగాణ భవిష్యత్తుకు కీలక వేదిక

‘మీ పెట్టుబడులకు మాది భరోసా’ అనే నినాదంతో నిర్వహించనున్న ఈ గ్లోబల్‌ సమ్మిట్‌ కేవలం వ్యాపార సదస్సుకే పరిమితం కాదని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే చారిత్రక వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. ఏర్పాట్ల కోసం ప్రత్యేక కమిటీని నియమించి, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతూ ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు.

పోలీస్‌ కమిషనరేట్‌ ప్రారంభం.. కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన

ఫ్యూచర్‌ సిటీ పర్యటనకు ముందు ఇబ్రహీంపట్నంలో నూతనంగా నిర్మించిన ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ను సీఎం ప్రారంభించారు. కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్యాలయాన్ని ప్రారంభించి, తరుణ్‌ జోషికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని సందర్శించి, ఎఫ్‌సీడీఏ కార్యాలయ ఆవరణలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అర్బన్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐయూఎం) క్యాంపస్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, డీజీపీ సీవీ ఆనంద్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

#InvestTelangana2026 #RevanthReddy #FutureCity #Telangana #GlobalInvestmentSummit #YoungIndiaSkillsUniversity #TelanganaInvestments #FutureCityDevelopment #NIUM #TelanganaNews