Home Telangana ఓటర్ల జాబితాలో పేరుందా..! లేనివారికి మరో అవకాశం

ఓటర్ల జాబితాలో పేరుందా..! లేనివారికి మరో అవకాశం

అక్టోబర్‌ 15, 16న ప్రత్యేక శిబిరాలు.

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) సందర్భంగా ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన వారికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పిస్తోంది. అర్హులైన ఓటర్లు జాబితాలో పేరు చేర్చుకునేందుకు అక్టోబర్‌ 15, 16 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనుంది. తొలిసారి ఓటు హక్కు పొందాలనుకునే యువత కూడా ఈ శిబిరాల్లో ఫామ్-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం జారీ చేసిన మెమో ప్రకారం, బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు), గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్‌ స్థాయి ఏజెంట్లు (బీఎల్‌ఏలు) శిబిరాల్లో అందుబాటులో ఉంటారు. జాబితాలో అర్హులైన ఓటర్లందరికీ చోటు కల్పించేలా జిల్లా ఎన్నికల అధికారులు, ఓటరు నమోదు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఇంటింటి సర్వేతో ఓటర్ల గుర్తింపు

గతంలో ఓటర్ల జాబితాలో పేరుండి, తాజా ముసాయిదాలో తొలగించబడిన వారి వివరాలను బీఎల్‌ఓలు గుర్తించాలి. ఇంటింటికీ వెళ్లి అర్హతను పరిశీలించి, అవసరమైన వారికి ఫామ్-6 దరఖాస్తు సమర్పించడంలో సహకరించాలి. ప్రతి బీఎల్‌ఓ వారానికి కనీసం 20 నుంచి 25 మంది ఓటర్లను పరిశీలించి, నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలి. గుర్తించిన వారి జాబితాలు, దరఖాస్తులు, క్షేత్రస్థాయి నివేదికలను సంబంధిత అధికారులతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేయాలి. నిరాశ్రయులు, రాత్రి ఆశ్రయ కేంద్రాల్లో నివసించేవారు, కార్మిక కాలనీల్లో ఉండేవారు, అణగారిన వర్గాల ప్రజల కోసం ప్రత్యేక నమోదు శిబిరాలు నిర్వహించాలని కూడా ఎన్నికల అధికారులు సూచించారు. అర్హులెవరూ ఓటు హక్కు కోల్పోకుండా విస్తృత ప్రచారం చేపట్టాలని ఆదేశించారు.

నవంబర్‌ 7 వరకు నమోదు అవకాశం

దావాలు, అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసినప్పటికీ తెలంగాణలో ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. నవంబర్‌ 7 వరకు ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంటుందని వెల్లడించాయి. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కొనసాగుతుంది. అయితే నవంబర్‌ 7 తర్వాత పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు తుది ఓటర్ల జాబితాలో ప్రతిబింబించవని అధికారులు స్పష్టం చేశారు. అలాంటి దరఖాస్తుదారులు కూడా ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులుగానే ఉంటారని తెలిపారు. అందువల్ల ముసాయిదా జాబితాలో పేరు లేని వారు, తొలిసారి ఓటు హక్కు పొందాలనుకునేవారు గడువులోగా దరఖాస్తు చేసుకోవడం కీలకం.

 

#TelanganaSIR #VoterList #VoterRegistration #VoterListRevision #Form6 #ElectionCommission #TelanganaNews #VoterRights #FirstTimeVoters #SpecialCamps #BLO #ElectionNews #IndiaNews