ఒంటిమిట్టలో వైసీపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు!
ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నారు? ప్రజలకు సమాధానం చెప్పాలి.. మామిళ్ల ఈశ్వరయ్యను గెలిపించండి
రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య
కోదండరాముడి కొలువైన ఒంటిమిట్టలో పంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ విమర్శలు పదునెక్కాయి. ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న వైఎస్సార్సీపీకి ఇప్పుడు సర్పంచి ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని రాష్ట్ర మాజీ డైరెక్టర్, ఒంటిమిట్ట మాజీ సర్పంచి కొమరా వెంకట నరసయ్య ప్రశ్నించారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఏబీ నిత్యానందరెడ్డి చివరి నిమిషంలో ఎందుకు పోటీ నుంచి తప్పుకున్నారో ఆ పార్టీ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎలాంటి ఒత్తిడి లేకుండానే అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకునే పార్టీ ఎన్నికల బరిలో నిలవకుండా వెనక్కి తగ్గడం ఒంటిమిట్ట రాజకీయ చరిత్రలోనే విచిత్రమని వ్యాఖ్యానించారు. లాలూచీ రాజకీయాలతో ఎంపీటీసీ ఎన్నికలకు దూరంగా ఉండి.. ఇప్పుడు సర్పంచి ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని నిలదీశారు. నిత్యానందరెడ్డి నామినేషన్ ఉపసంహరణలో ప్రధాన పాత్ర పోషించారని ఆరోపిస్తున్న మేకపాటి కిషోర్రెడ్డికి కూడా ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు.
ఒంటిమిట్ట అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళుతోందని నరసయ్య పేర్కొన్నారు. శ్రీకోదండరామాలయాన్ని మరో భద్రాద్రిగా తీర్చిదిద్దే లక్ష్యంతో వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రూ.34 కోట్లతో శ్రీరామ ఎత్తిపోతల పథకం ద్వారా ఒంటిమిట్ట చెరువుకు నీరు అందించి రైతుల సాగునీటి, ప్రజల తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. టీటీడీ పరిధిలో పైపులైన్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఇనుప గొట్టాలతో కొత్త పైపులైన్ నిర్మాణం త్వరలో పూర్తవుతుందని చెప్పారు.
ఒంటిమిట్ట అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం గతంలో వైఎస్సార్సీపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ రాష్ట్రంలో కనుమరుగయ్యే పరిస్థితి ఉందని విమర్శించారు. మరో ఎనిమిదేళ్లపాటు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వమే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ నుంచి ఎందుకు తప్పుకున్నారో వైఎస్సార్సీపీ నాయకులను గ్రామంలో ప్రతి ఓటరూ నిలదీయాలని పిలుపునిచ్చారు. కుట్ర రాజకీయాలతో ఒంటిమిట్టలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి మామిళ్ల ఈశ్వరయ్య విజయాన్ని అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలాంటి ప్రయత్నాలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని, మామిళ్ల ఈశ్వరయ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో సర్పంచి అభ్యర్థి మామిళ్ల ఈశ్వరయ్య, మహిళా నాయకురాలు ఓబినేని సుబ్బమ్మ, పామూరు సుబ్రహ్మణ్యం, బాలకృష్ణ, కట్ట సుధాకర్, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, సి.రామకృష్ణారెడ్డి, షేక్ నఫీఉల్లా, షేక్ అజ్మతుల్లా, సయ్యద్ చాంద్ భాషా, మామిళ్ల రామకృష్ణ, మోదుగుల చిన్న నరసింహులు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











