బీసీ కులాల జనాభాను తక్కువగా చూపించే కుట్ర జరుగుతోందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. దేశంలో ఎంతటి ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులైనా కుల వివక్షకు అతీతులు కారని ఆమె అన్నారు. రాష్ట్రపతి, స్పీకర్ వంటి అత్యున్నత పదవుల్లో ఉన్నవారు కూడా కుల వివక్షను ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. లక్షలాది మంది ఇప్పటికీ రోజువారీ జీవితంలో వివక్షను ఎదుర్కొంటున్నారని చెప్పారు. లంబాడాలకు ఇళ్లు ఇవ్వవద్దంటూ బోర్డు పెట్టిన ఘటనను ప్రస్తావిస్తూ, కులం ఆధారంగా ఇళ్లు నిరాకరించడం దారుణమన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రావాలంటే ముందుగా సమాజ ఆలోచనా విధానంలో మార్పు రావాలని కవిత సూచించారు.
అన్ని వర్గాలకు సాధికారత
కుల వివక్షను బాధితుల కోణంలోనూ చూడాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. కులం సంక్లిష్టమైన సామాజిక సమస్యగా పేర్కొంటూ, రాజ్యాధికారంలో అన్ని కులాలకు భాగస్వామ్యం కల్పించడంతో పాటు ఆర్థికంగా బలోపేతం చేయాలని సూచించారు. కలిసి కూర్చున్నా, తాకినా ఏదో జరుగుతుందనే మూఢ భావనలు ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉదాహరణగా చూపుతూ, రాజకీయ, సాంస్కృతిక ఐక్యతతోనే రాష్ట్ర సాధన సాధ్యమైందని గుర్తుచేశారు. బతుకమ్మ, బోనాల ద్వారా మహిళలు ఉద్యమానికి మద్దతిచ్చారని తెలిపారు. అదే సమిష్టి స్ఫూర్తితో కుల వివక్షకు పరిష్కారం వెతికి, ప్రతి కులాన్ని సాధికారత కల్పించినప్పుడే సమానత్వం సాధ్యమవుతుందని కవిత పేర్కొన్నారు.
#KKavitha #Kavitha #BCPopulation #BCCommunities #BackwardClasses #CasteDiscrimination #CasteCensus #SocialJustice #BCEmpowerment #CasteInequality #PoliticalRepresentation #EconomicEmpowerment #TelanganaPolitics #Equality #SocialJusticeIndia











