ముకేశ్‌పై మస్క్ మాటల యుద్ధం!
భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రవేశంపై వివాదం ముదురుతోంది. స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని లక్ష్యంగా చేసుకుని వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించినట్లుగా వ్యంగ్యంగా పోస్టు చేస్తూ, అంబానీని ‘భారత్‌కు అసలైన ప్రధాని’గా పేర్కొన్నారు. “ప్రియమైన ప్రధాని అంబానీ గారూ.. మీరే భారతదేశానికి అసలైన బాస్ అని ఇంతకాలం గుర్తించలేకపోయినందుకు దయచేసి నా వినయపూర్వక క్షమాపణలను స్వీకరించండి.” అంటూ రాసుకొచ్చారు.
టార్గెట్ అంబానీ
“సహజంగానే, భారతదేశంలోని గొప్ప ప్రజలను గుత్తాధిపత్యం ద్వారా దోపిడీ చేస్తూ కొనసాగించడానికే మీరు ఇష్టపడతారు. అయినప్పటికీ, స్టార్‌లింక్‌కు పోటీ పడే అవకాశం కల్పించడాన్ని మీరు పరిశీలించగలరా?” అని ఆయన ప్రశ్నించారు. “భారత్‌లోనే కాదు, ప్రతి దేశంలోనూ ఇంటర్నెట్ సదుపాయం లేని అనేక ప్రాంతాలు ఉన్నాయి. దీనివల్ల పిల్లలు విద్యను పొందే అవకాశం కోల్పోతున్నారు. చిన్న వ్యాపారులు తమ వస్తువులను ప్రపంచ మార్కెట్‌లో విక్రయించే అవకాశాన్ని కోల్పోతున్నారు. స్టార్‌లింక్ ఈ పరిస్థితిని మార్చి, వారి జీవితాలను మెరుగుపరుస్తుంది.” అని మస్క్ పేర్కొన్నారు.
గుత్తాధిపత్యంపై మస్క్ ఆరోపణలు
భారత్‌లో స్టార్‌లింక్ ప్రవేశాన్ని కొందరు వ్యాపార దిగ్గజాలు అడ్డుకుంటున్నారని మస్క్ బుధవారం ఆరోపించారు. గురువారం మరో పోస్టులో, భారత ప్రభుత్వ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ లైసెన్స్ ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. 165కు పైగా దేశాల్లో స్టార్‌లింక్‌కు అనుమతులు ఉన్నాయని పేర్కొంటూ, భారత్‌లోనూ సేవలు ప్రారంభించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలు విఫలమైనప్పుడు స్టార్‌లింక్ ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించిందని ఆయన వాదించారు.
లైసెన్స్‌పై కేంద్రం వివరణ
మస్క్ ఆరోపణలను కేంద్ర సమాచార శాఖ తోసిపుచ్చింది. శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు సంబంధించి భారత్‌లో పక్షపాతం లేని నియంత్రణ విధానం అమల్లో ఉందని స్పష్టం చేసింది. స్టార్‌లింక్‌తో పాటు భారతి మద్దతున్న యూటెల్‌శాట్ వన్‌వెబ్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్‌కు టెలికాం లైసెన్సులు మంజూరయ్యాయి. అయితే సేవలు ప్రారంభించాలంటే స్పెక్ట్రమ్ కేటాయింపుతో పాటు భద్రతా నిబంధనల అనుసరణ అవసరం. ఈ ప్రక్రియలో భద్రతా పరిశీలన కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. దీంతో మస్క్ ఆరోపణలు, కేంద్రం వివరణల మధ్య స్టార్‌లింక్ ప్రవేశంపై వివాదం కొనసాగుతోంది.











