Home Telangana భూములు అమ్మి పాలన సాగిస్తారా?

భూములు అమ్మి పాలన సాగిస్తారా?

మియాపూర్ భూముల అమ్మొద్దు!
రేవంత్ రెడ్డికి డీకే అరుణ కౌంటర్ .

మియాపూర్‌లో సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన 550 ఎకరాల భూములను వేలం వేసి సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనపై బీజేపీ ఎంపీ డీకే అరుణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు అమ్మి రాష్ట్రాన్ని నడపాలనుకోవడం పాలనలో అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి ఢిల్లీకి పంపుతున్న నిధులను నిలిపివేస్తే రాష్ట్ర అభివృద్ధికి సరిపడా డబ్బులు అందుబాటులో ఉంటాయని వ్యాఖ్యానించారు. విలువైన ప్రభుత్వ ఆస్తులను విక్రయించకుండా ఆదాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు.

23 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు

మియాపూర్‌లోని సర్వే నంబర్లు 100, 101 పరిధిలో ఉన్న 550 ఎకరాల 39 గుంటల భూమిపై 23 ఏళ్లుగా న్యాయవివాదం కొనసాగింది. సుమారు రూ.25 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల వరకు విలువైన ఈ భూముల్లో హైదరాబాద్ మెట్రో రైలు డిపో కూడా ఉంది. అక్టోబర్ 29న సుప్రీంకోర్టు ప్రైవేటు హక్కుదారుల పిటిషన్లను తిరస్కరించి ప్రభుత్వ యాజమాన్యాన్ని సమర్థించింది. చారిత్రక జాగీర్ హక్కుల ఆధారంగా చేసిన ప్రైవేటు వాదనలను కోర్టు అంగీకరించలేదు. ఈ తీర్పుపై సీఎం రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వ ప్రత్యేక చొరవగా పేర్కొనగా, గత ప్రభుత్వాల హయాంలోనూ న్యాయపోరాటం కొనసాగిందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు. దీంతో భూముల వేలం ప్రతిపాదనతో పాటు ఈ విజయం వెనుక ఎవరి పాత్ర ఎంత అనే రాజకీయ చర్చ మొదలైంది.

 

#DKAruna #MiyapurLands #MiyapurLandAuction #RevanthReddy #TelanganaPolitics #SupremeCourtVerdict #GovernmentLands #HyderabadMetro #BJP #Congress #BRS #TelanganaNews