స్మార్ట్ తయారీకి చైనాకు ప్రతిపాదనలు.
బ్రిక్స్ సదస్సు రెండో సెషన్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ డిజిటల్ భవిష్యత్తుపై తన దృష్టిని స్పష్టంగా వెల్లడించారు. అంతర్జాతీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలను ఏకం చేసి అంతర్జాతీయ వ్యవస్థలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేని విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. శక్తివంతమైన దేశానిదే న్యాయం అనే ధోరణిని తిరస్కరించాలని, సార్వభౌమ సమానత్వం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, శాంతియుతంగా వివాదాల పరిష్కారం వంటి అంతర్జాతీయ సూత్రాలను అన్ని దేశాలు సమానంగా పాటించేలా చూడాలని సూచించారు. ప్రపంచంలో స్థిరత్వం కోసం బ్రిక్స్ కీలక శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని జిన్‌పింగ్ స్పష్టం చేశారు.
ఏఐకి ఓపెన్ సోర్స్ వేదిక
బ్రిక్స్ దేశాల డిజిటల్ సామర్థ్యాలను పెంచేందుకు చైనా ఐదు అంశాలతో కూడిన ఏఐ, సాంకేతికత ప్రణాళికను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా బ్రిక్స్ ఏఐ ఓపెన్ సోర్స్ కమ్యూనిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఏఐ రంగంలో పరస్పర సహకారంతో ఓపెన్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడమే దీని లక్ష్యం. అలాగే ‘బ్రిక్స్ డిజిటల్ ఎకోసిస్టమ్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. సభ్య దేశాల మధ్య డిజిటల్ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, సహకార వ్యవస్థలను విస్తరించేందుకు ఇది ఉపయోగపడుతుందని చైనా భావిస్తోంది. వచ్చే ఏడాది బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న చైనా.. ఈ ప్రతిపాదనల ద్వారా కూటమి డిజిటల్ ఎజెండాలో తన నాయకత్వాన్ని బలపరచే ప్రయత్నం చేస్తోంది.
స్మార్ట్ ఫ్యాక్టరీల నుంచి నైపుణ్య శిక్షణ
ఏఐతో పాటు తయారీ రంగంలోనూ బ్రిక్స్ దేశాలను ముందుకు తీసుకెళ్లేందుకు చైనా కీలక ప్రతిపాదనలు చేసింది. ‘ఇంటెలిజెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ కోఆపరేషన్ ఇనిషియేటివ్’ ద్వారా సభ్య దేశాల్లో స్మార్ట్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు సహకరించాలని, తయారీ ప్రమాణాలు, నియమాలను అభివృద్ధి చేయాలని సూచించింది. అలాగే బ్రిక్స్ ప్రత్యేక ఆర్థిక మండలాల భాగస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసి.. దేశాలు ఒకే డిజిటల్ పోర్టల్ ద్వారా అనుసంధానమై విధానాలను సమన్వయం చేసుకునేలా చేయాలని ప్రతిపాదించింది. శాస్త్ర సాంకేతిక రంగంలో నైపుణ్యం పెంచేందుకు ఇంజినీర్ల అభివృద్ధి కూటమిని కూడా ఏర్పాటు చేయాలని జిన్‌పింగ్ సూచించారు. ఇంజినీర్లకు సంయుక్త శిక్షణ, నైపుణ్య ప్రమాణాల పరస్పర గుర్తింపుపై దృష్టి పెట్టాలని తెలిపారు. అమెరికాతో చైనా కొనసాగిస్తున్న వాణిజ్య, సాంకేతిక పోటీ నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రిక్స్ ద్వారా చైనా తన ఏఐ, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ సామర్థ్యాలను అభివృద్ధి చెందుతున్న దేశాలకు విస్తరించే వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
#China #XiJinping #BRICS #BRICSSummit #BRICS2026 #ChinaBRICS #BRICSAI #AI #ArtificialIntelligence #OpenSourceAI #BRICSDigitalEcosystem #DigitalCooperation #SmartManufacturing #SmartFactories #IntelligentManufacturing #BRICSTechnology #GlobalSouth #ChinaAI #ChinaUSCompetition #BRICSLeadership #TechnologyNews











