Home AP మహిళా రిజర్వేషన్లకు చంద్రబాబు సంపూర్ణ మద్దతు!

మహిళా రిజర్వేషన్లకు చంద్రబాబు సంపూర్ణ మద్దతు!

డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టం ఉండదని వెల్లడి!
50 శాతం సీట్ల పెంపు.. మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం!

మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నవంబర్ 27న ఢిల్లీలో కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామితో కలిసి మీడియాతో మాట్లాడుతూ, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా సాధికారతకు ఇప్పుడు అవకాశం వచ్చిందన్నారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా లోక్‌సభ స్థానాలు పెరగాలని, ప్రస్తుత 543 స్థానాలు సరిపోవడం లేదని అభిప్రాయపడ్డారు.

దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి భరోసా

ప్రతి రాష్ట్రంలోనూ లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచితే దక్షిణాది ప్రాతినిధ్యానికి నష్టం ఉండదని చంద్రబాబు వివరించారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న 25 స్థానాలు 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి పెరిగే అవకాశం ఉందన్నారు. తమిళనాడులో 59, కర్ణాటకలో 42, కేరళలో 30 స్థానాలకు చేరవచ్చని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి ప్రాతినిధ్యం 129 నుంచి 195కు పెరుగుతుందని చెప్పారు. రాష్ట్రాల మధ్య ప్రస్తుత సీట్ల నిష్పత్తిని 2051 వరకు కొనసాగించే ప్రతిపాదన దక్షిణాది ఆందోళనలకు పరిష్కారమని పేర్కొన్నారు.

అన్ని పార్టీలకు చంద్రబాబు విజ్ఞప్తి

మహిళా సాధికారతకు ఎన్టీఆర్ ఆస్తి హక్కులు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లతో పునాది వేశారని చంద్రబాబు గుర్తుచేశారు. డ్వాక్రా సంఘాలు, స్వయం బ్రాండ్ ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏపీ అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్మానం చేసినట్లు తెలిపారు. పార్లమెంట్‌లో రెండు బిల్లులకూ అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. మహిళల రాజకీయ భాగస్వామ్యానికి అడ్డుపడితే వారు అలాంటి పార్టీలను తిరస్కరిస్తారని వ్యాఖ్యానించారు. 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం కావాలని ఆకాంక్షించారు.

 

#ChandrababuNaidu #WomensReservation #DelimitationBill #LokSabha #SouthIndia #AndhraPradesh #Telangana #WomenEmpowerment #33PercentReservation #NDA #Parliament #2029Elections