Home Telangana దానం తీర్పుపై బీఆర్‌ఎస్‌ హర్షం

దానం తీర్పుపై బీఆర్‌ఎస్‌ హర్షం

సుప్రీం తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు: కేటీఆర్‌.

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పును బీఆర్‌ఎస్‌ స్వాగతించింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందిస్తూ.. ఈ తీర్పు రాహుల్‌ గాంధీ, రేవంత్‌రెడ్డికి చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకునేందుకు దానం చేసిన ప్రయత్నానికి సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసిందన్నారు. హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పులో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని కేటీఆర్‌ తెలిపారు. ఖైరతాబాద్‌ ప్రజలు మూడు సంవత్సరాల మోసం, నెరవేరని హామీలు, పాలనపై త్వరలో తమ తీర్పు ఇస్తారని అన్నారు.

రేవంత్‌కు సుప్రీం తీర్పు చెంపపెట్టు: హరీశ్

దానం నాగేందర్‌ అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రేవంత్‌రెడ్డికి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. ఫిరాయింపుదారులను కాపాడే ప్రయత్నాలు బయటపడ్డాయని ఆరోపిస్తూ, పార్టీ మారిన మిగిలిన ఎమ్మెల్యేల విషయంలోనూ ఇదే పరిణామం ఎదురవుతుందని హరీశ్‌రావు పేర్కొన్నారు.

ఫిరాయింపులపై కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరి

బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు సైతం తీర్పుపై స్పందిస్తూ కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరిని ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షణ గురించి కాంగ్రెస్‌ మాట్లాడుతూనే ఉంటుందని, రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా ‘సంవిధాన్‌ బచావో’ నినాదం చేస్తున్నారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. దానం అనర్హత విషయంలో బీజేపీ క్రెడిట్‌ తీసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ సాగించిన న్యాయపోరాటం ఫలితంగానే అనర్హత అమలైందని పేర్కొన్నారు. ఫిరాయింపులపై నిజంగా పోరాడాలనే ఉద్దేశం బీజేపీకి ఉంటే, కాంగ్రెస్‌లో చేరిన మిగిలిన ఎనిమిది మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై ఎందుకు పిటిషన్లు వేయలేదని ప్రశ్నించారు.

 

#BRS #DanamNagender #KTR #HarishRao #Khairatabad #SupremeCourt #MLADisqualification #AntiDefectionLaw #TenthSchedule #RevanthReddy #Congress #TelanganaPolitics #BRSvsCongress #KhairatabadBypoll #TelanganaNews