బంగ్లా భళా.. ఆసీస్ డీలా! క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేసేలా బంగ్లాదేశ్ చరిత్ర తిరగరాసింది. ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టును తొలిసారి టెస్టులో మట్టికరిపించి 23 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. డార్విన్ వేదికగా జరిగిన పోరులో బంగ్లా ఆటగాళ్లు బ్యాట్, బంతితో అదరగొట్టారు. తొలుత హసన్ మహ్ముద్ బౌలింగ్ ధాటికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత తంజీద్ హసన్ తమీమ్ అద్భుత శతకంతో బంగ్లాదేశ్ భారీ ఆధిక్యం సాధించింది. 228 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆస్ట్రేలియాపై ఒత్తిడిని మరింత పెంచింది. రెండో ఇన్నింగ్స్‌లో కామెరాన్ గ్రీన్ శతకంతో ఆసీస్ కొంత ప్రతిఘటించినా, బంగ్లా బౌలర్లు పట్టు వదల్లేదు. చివరకు కేవలం 57 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ తొమ్మిది వికెట్ల తేడాతో ఛేదించింది. సొంత గడ్డపై బలీయమైన ఆసీస్‌కు బంగ్లా ఇచ్చిన షాక్ ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇది కేవలం ఒక టెస్టు విజయం కాదు.. బంగ్లాదేశ్ క్రికెట్ ఆత్మవిశ్వాసాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లిన చారిత్రక ఘట్టం.

హసన్ మహ్ముద్ అదిరిపోయే బౌలింగ్
డార్విన్ వేదికగా బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుపై తొలిసారి టెస్టు విజయం నమోదు చేసింది. 2003లో ఇదే డార్విన్‌లో ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ తొలి టెస్టు ఆడింది. 23 ఏళ్ల తర్వాత అదే మైదానంలో తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి అద్భుత రికార్డు సృష్టించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను కేవలం 198 పరుగులకే కట్టడి చేయడమే ఈ విజయానికి బలమైన పునాది వేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో హసన్ మహ్ముద్ ఆరు వికెట్లతో చెలరేగాడు. స్టీవ్ స్మిత్ 109 బంతుల్లో 71 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించలేదు. బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో తంజీద్ హసన్ తమీమ్ 101 పరుగులతో అదరగొట్టాడు. ఇది అతని రెండో టెస్టు మాత్రమే. మోమినుల్ హక్ 49, నజ్ముల్ హొస్సేన్ శాంటో 84, మెహిదీ హసన్ మిరాజ్ 65 పరుగులతో రాణించడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులు చేసి 228 పరుగుల ఆధిక్యం సాధించింది.

57 పరుగుల లక్ష్యం.. తొమ్మిది వికెట్ల గెలుపు
రెండో ఇన్నింగ్స్‌లో కామెరాన్ గ్రీన్ 201 బంతుల్లో 104 పరుగులు చేసి ఆస్ట్రేలియాను 284 పరుగుల వరకు తీసుకెళ్లాడు. దీంతో బంగ్లాదేశ్ ముందు కేవలం 57 పరుగుల విజయ లక్ష్యం నిలిచింది. నాలుగో రోజు లక్ష్య ఛేదనలో రెండో ఓవర్‌లో తంజీద్ హసన్ డకౌట్ అయినా బంగ్లాదేశ్ ఏమాత్రం ఒత్తిడికి లోనుకాలేదు. మిగతా బ్యాటర్లు లక్ష్యాన్ని సునాయాసంగా అందుకున్నారు. ఆస్ట్రేలియాపై ఇప్పటివరకు జరిగిన ఏడు టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు ఇది తొలి విజయం. 2017లో స్వదేశంలో ఒకసారి గెలిచిన బంగ్లా.. ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపైనా విజయం సాధించి చరిత్రలో తన పేరును లిఖించింది.











