Home Telangana ఎల్‌నినో ముప్పు.. తెలంగాణకు సీఎం అలర్ట్‌!

ఎల్‌నినో ముప్పు.. తెలంగాణకు సీఎం అలర్ట్‌!

సంక్షోభాన్ని ముందే గుర్తించాలి.
రాబోయే ఎనిమిది నెలలు కీలకం..
నీరు, విద్యుత్‌ పొదుపుపై ప్రత్యేక దృష్టి.

ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో ఎదురయ్యే సంక్షోభాన్ని ముందుగానే గుర్తించి, తెలంగాణలో తక్షణ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం జూబ్లీహిల్స్‌ నివాసంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్‌ రంగాలపై ప్రత్యేకంగా చర్చించారు. పరిస్థితులు చేయిదాటకముందే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజలను అప్రమత్తం చేసి, సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

ఎనిమిది నెలలు అత్యంత కీలకం

రాబోయే ఎనిమిది నెలలు ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవడంలో కీలకమని సీఎం పేర్కొన్నారు. విద్యుత్‌ కొరత పెరిగే ప్రమాదం ఉందని, అవసరమైన విద్యుత్‌ కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా మార్కెట్‌లో సరఫరా పరిమితంగా ఉందని తెలిపారు. అందుబాటులో ఉన్న విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని సూచించారు. విద్యుత్‌ ఆధారిత పనులను సాధ్యమైనంత వరకు తాత్కాలికంగా వాయిదా వేసే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సినిమా, మీడియా, కళాజాతలతో పాటు ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

పంటలు కాపాడేందుకు ముందస్తు చర్యలు

రైతులు సాగు చేసిన పంటల పరిస్థితిని అంచనా వేసి, పంట చేతికొచ్చే వరకు నీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చుక్క నీరు కూడా వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని సుమారు 215 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కరువు మండలాల ప్రకటన, ఆర్థిక సాయం కోసం కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. వీబీజీరామ్‌జీ పథకం కింద 125 రోజుల ఉపాధికి అదనంగా మరో 50 రోజుల పని కల్పించాలని కేంద్రాన్ని కోరాలని సూచించారు. అవసరమైతే అదనపు పనిదినాల బాధ్యత తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

వార్‌రూమ్‌ ఏర్పాటు.. మంత్రులతో ప్రత్యేక భేటీ

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై త్వరలో మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంటామని రేవంత్‌రెడ్డి తెలిపారు. అవసరమైతే అఖిలపక్ష సమావేశం నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. దసరా తర్వాత గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు వార్‌రూమ్‌, టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్‌ సరఫరాను ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

#ElNino #Telangana #RevanthReddy #ElNinoAlert #TelanganaDrought #WaterConservation #PowerConservation #TelanganaAgriculture #Farmers #DroughtPreparedness #TelanganaGovernment #RainfallDeficit #WarRoom #TelanganaNews