గ్రీన్‌కార్డ్ ప్రోగ్రామ్ నుంచి దిగ్గజాల ఔట్.
భారత ఐటీ సంస్థలకు షాకిచ్చిన ట్రంప్ .
అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు కీలకంగా మారిన గ్రీన్‌కార్డ్ ప్రక్రియపై ట్రంప్ ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమినీ వంటి ప్రముఖ సంస్థలను పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్ చేసింది. అమెరికా కార్మిక శాఖ మంత్రి కీత్ సోండర్లింగ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా కంపెనీలు హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగం, గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసే అవకాశం ఉంటుంది.
అమెరికన్ల ఉద్యోగాలపై వాదన
ఈ సంస్థలు విదేశీ ఉద్యోగులను భారీగా నియమించడం వల్ల అమెరికన్ల ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. 2009 నుంచి సస్పెండ్ చేసిన సంస్థలు దాదాపు 30 లక్షల విదేశీ ఉద్యోగులను కోరాయని, 2.30 లక్షలకు పైగా హెచ్-1బీ అనుమతులు పొందాయని సోండర్లింగ్ తెలిపారు. లక్షకు పైగా పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్లు కూడా పొందినట్లు చెప్పారు. కొత్త దరఖాస్తులను స్వీకరించకపోవడంతో పాటు, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ప్రక్రియను కూడా నిలిపివేయనున్నట్లు స్పష్టం చేశారు.
వాన్స్ తీవ్ర విమర్శలు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఐటీ కంపెనీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, 6 వేల మంది అమెరికా ఉద్యోగులను తొలగించిన తర్వాత అదే సంస్థ వేలాది హెచ్-1బీ దరఖాస్తులు చేసిందని ఆరోపించారు. హెచ్-1బీ ఉద్యోగులను “విదేశీ ఒప్పంద కార్మికులు”గా అభివర్ణించిన వాన్స్, ఈ విధానాన్ని ఉపయోగించే కంపెనీలను “వీసా మిల్లులు”గా విమర్శించారు. అమెరికా ఉద్యోగుల వేతనాలను తగ్గించేందుకు వీసా విధానాలను దుర్వినియోగం చేయడాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు.
భారత నిపుణులపై ప్రభావం
ప్రతి ఏడాది అమెరికా ఆమోదించే హెచ్-1బీ వీసాల్లో భారతీయ ఐటీ నిపుణుల వాటా గణనీయంగా ఉంటుంది. దీంతో తాజా నిర్ణయం భారత ఐటీ కంపెనీలు, అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే హెచ్-1బీ వీసాపై 1 లక్ష డాలర్ల ఫీజు విధించే నిర్ణయాన్ని ట్రంప్ ప్రభుత్వం మరో ఏడాదికి పొడిగించింది. ఇప్పుడు గ్రీన్కార్డ్కు దారితీసే పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రక్రియపై ఆంక్షలు విధించడంతో అమెరికాలో భారతీయ టెక్ ఉద్యోగుల భవిష్యత్తుపై కొత్త ఆందోళనలు మొదలయ్యాయి.
#DonaldTrump #IndianIT #GreenCard #H1BVisa #USImmigration #Cognizant #Infosys #TCS #Wipro #HCLTech #Capgemini #JDVance #IndianTechWorkers #USITJobs










