Home National_news ఆర్థిక ఒత్తిళ్ల వేళ జీఎస్టీ సంస్కరణలు

ఆర్థిక ఒత్తిళ్ల వేళ జీఎస్టీ సంస్కరణలు

రేట్లకు బ్రేక్‌.. విధానాలపై కీలక దృష్టి

ఆర్థిక ఒత్తిళ్లు, వ్యాపార రంగంలో అనిశ్చితి కొనసాగుతున్న వేళ అక్టోబర్‌ 8 రేపు జరిగే 57వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంపై ఆసక్తి పెరిగింది. ఈ భేటీలో జీఎస్టీ రేట్లలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రెండు రేట్ల విధానం కొనసాగింపుతో పాటు రిజిస్ట్రేషన్‌, రిఫండ్లు, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌, పన్ను అమలు విధానాల్లో సంస్కరణలపై ప్రధానంగా చర్చ జరగనుంది. భవిష్యత్తులో జీఎస్టీ రేట్లను ఏడాదికి ఒక్కసారి మాత్రమే మార్చి, ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేసే విధానాన్ని పరిశీలించే అవకాశం ఉంది. అక్టోబర్‌ నుంచి జూలై వరకు పన్ను పరిధిలోని సరఫరాలు 25.8 శాతం పెరగడం, స్థూల పన్ను బాధ్యత 13.6 శాతం పెరగడం రేట్ల స్థిరత్వానికి అనుకూలంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

రిఫండ్లు, క్రెడిట్‌పై కొత్త విధానం

వ్యాపారులకు నేరుగా ప్రభావం చూపే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ నిబంధనల్లో మార్పులు ప్రతిపాదించారు. సరైన ఇన్వాయిస్‌ ఉండి, వస్తువులు అందుకుని, సరఫరాదారుకు పన్నుతో సహా పూర్తి చెల్లింపు చేసిన కొనుగోలుదారుడు.. సరఫరా గొలుసులో తరువాతి దశలో తప్పిదం జరిగినా క్రెడిట్‌ కొనసాగించుకునే అవకాశం కల్పించనున్నారు. రిఫండ్‌ ప్రక్రియను వేగవంతం చేయడం మరో కీలక ప్రతిపాదన. ప్రస్తుతం సగటున 25 రోజులు పడుతున్న రిఫండ్‌ ప్రక్రియలో 10 రోజుల్లోనే అంగీకారం, రిస్క్‌ తనిఖీ తర్వాత 90 శాతం అర్హత కలిగిన మొత్తాన్ని విడుదల చేసే విధానం పరిశీలనలో ఉంది. కస్టమ్స్‌, బ్యాంకింగ్‌ వ్యవస్థల నుంచి సమాచారం ఆటోమేటిక్‌గా తీసుకునేలా సాంకేతిక మార్పులు చేయనున్నారు. సేవలు, ప్లాంట్‌, యంత్రాలపై చెల్లించిన పన్నుకు కూడా రిఫండ్‌ అర్హతను విస్తరించే ప్రతిపాదన ఉంది.

చిన్న వ్యాపారాలకు మరింత సులభత

జీఎస్టీ రిజిస్ట్రేషన్‌, సవరణలను మరింతగా ఆటోమేషన్‌ చేయడం కూడా సమావేశం అజెండాలో ఉంది. ప్రస్తుతం 61 శాతం రిజిస్ట్రేషన్లు అధికారుల జోక్యం లేకుండానే మూడు పని దినాల్లో పూర్తవుతున్నాయి. చిన్న వ్యాపారాలు రాష్ట్ర సరిహద్దులు దాటి ఈ-కామర్స్‌ ద్వారా విక్రయాలు చేయడాన్ని సులభతరం చేసే మార్పులు కూడా ప్రతిపాదించారు. ఎగుమతిదారులకు ఊరట కల్పించే చర్యల్లో భాగంగా విదేశీ క్లయింట్లకు సేవలు అందించే సంస్థలకు కొన్ని నిబంధనలను సరళీకరించనున్నారు. మరోవైపు జీఎస్టీ ఉల్లంఘనలపై జైలు శిక్షకు బదులుగా పన్ను వసూలు, వడ్డీ, తగిన జరిమానాలకు ప్రాధాన్యం ఇచ్చే విధానం పరిశీలనలో ఉంది. ఆలస్యం, అనుకోకుండా జరిగిన తప్పిదాలు, చెల్లింపుల లోపాలను నేరాలుగా పరిగణించే పరిధిని తగ్గించాలన్నది ప్రతిపాదన. రాష్ట్రాలతో సంప్రదింపుల అనంతరం రూపొందించిన ఈ సంస్కరణలను కౌన్సిల్‌ ఆమోదిస్తే 2027 వరకు దశలవారీగా అమలు చేసే అవకాశం ఉంది.

 

#GSTCouncil #GSTCouncilMeeting #GSTReforms #GSTRates #GST2026 #InputTaxCredit #GSTRefunds #GSTRegistration #TaxReforms #GSTCompliance #GSTDecriminalisation #ExportRelief #SmallBusinesses #GSTIndia #TaxPolicy