రాయలసీమలో నీళ్లే లేవు.. !
కానీ హార్టీకల్చర్ హబ్ మాత్రం రెడీనా.
చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు .
రాయలసీమలో ఎండలు మండుతున్నాయి.. పొలాలు నీటి కోసం ఎదురుచూస్తున్నాయి.. రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో ఎనిమిది జిల్లాలను ‘హార్టీకల్చర్ హబ్’గా మారుస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం కార్యక్రమం చేపట్టడాన్ని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైరికల్‌గా ప్రశ్నించారు. “మొక్క బతకాలంటే ముందు నీరు కావాలి కదా బాబుగారూ?” అంటూ ఆయన సంధించిన ప్రశ్న ఇప్పుడు అసలు కథను తెరపైకి తెస్తోంది.
రిజర్వాయర్ ఎక్కడ బాబూ?
45 ఏళ్ల రాజకీయ అనుభవం.. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి బాధ్యతలు.. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా రాయలసీమలో ఒక్కటంటే ఒక్కటి 50 టీఎంసీల భారీ రిజర్వాయర్ నిర్మాణం కాలేదని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇప్పుడు నీటి వసతి లేకుండానే రాయలసీమను ఉద్యానవనాల ప్రాంతంగా మారుస్తామని చెప్పడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కాల్వలు లేవు.. నీటి నిల్వలు లేవు.. మరి తోటలు ఎలా పెరుగుతాయన్నదే అసలు ట్విస్ట్ అంటూ ఎద్దేవా చేశారు. ఉద్యాన పంటలకు నీరు అవసరం.. నీటికి రిజర్వాయర్లు అవసరం.. రిజర్వాయర్లకు ప్రణాళికలు అవసరం. కానీ ఇవేవీ లేకుండా రాయలసీమను ‘హార్టీకల్చర్ హబ్’గా మార్చేస్తామంటే అది పథకమా.. ప్రచారమా.. లేక మరో కొత్త ప్రయోగమా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఎల్‌నినో ప్రభావంతో ఎండలు మండుతున్న వేళ ఈ ప్రకటన చేయడం మరింత ఆసక్తికరంగా ఉందన్నారు.
సినిమా పేరు గుర్తొస్తోంది!
రాయలసీమలో నీటి సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన వారు కూడా మౌనం వహిస్తున్నారంటూ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. “నీరు ఎక్కడి నుంచి వస్తుంది?” అనే చిన్న ప్రశ్న తప్ప మిగతా అన్నీ అడగొచ్చన్నట్టుగా వ్యవహారం ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నీరు లేకుండా ఉద్యానవనాలు ఎలా పెంచుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వ్యవహారశైలిని చూస్తుంటే ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా గుర్తుకొస్తోందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రాయలసీమలో హార్టీకల్చర్ హబ్ కావాలి.. పచ్చటి పొలాలు కావాలి.. ఉద్యానవనాలు కావాలి.. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ నీళ్లు ఎక్కడి నుంచి? ఇదే ప్రశ్నకు సమాధానం లేకపోతే.. మిగతా కథంతా సినిమా పోస్టర్లా కనిపిస్తుందన్నది ఆయన సెటైర్.
#VijayasaiReddy #ChandrababuNaidu #Rayalaseema #WaterCrisis #RayalaseemaDrought #HorticultureHub #AndhraPradesh #Irrigation #WaterShortage #Reservoirs #APPolitics #ElNino











