బాబు హయాంలోనూ సేమ్ సీన్ రిపీట్.
నాడు వై నాట్ 175 వైసీపీ నినాదం.
అదే మాయలో పడితే కూటమికి ప్రమాదం.
ప్రజల నాడిని సర్వేలు అద్దం పడతాయా?
అధికార పార్టీ మెప్పు కోసమే మాయ చేస్తాయా?
ఎన్నికలు ఇంకా దూరంలోనే ఉన్నాయి.. కానీ ఆంధ్రప్రదేశ్లో సర్వేల సందడి మాత్రం ఇప్పుడే మొదలైంది! ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? ఎవరి ప్రభుత్వం వస్తుంది? అంటూ రోజుకో సర్వే, పూటకో అంచనా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఒక సంస్థ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని చెబుతోంది.. మరో సంస్థ కాదు కూటమి తిరిగి అధికారంలోకి వస్తోందంటోంది. ఒక సంస్థ జగన్కు ప్లస్ అంటోంది. మరో సంస్థ కూటమికే అడ్వాంటేజ్ అంటోంది. ఒకే రాష్ట్రం.. ఒకే ఓటరు.. కానీ ఇన్ని భిన్నమైన తీర్పులెలా? అసలు ఈ సర్వేలు చేసిందెవరు? ఎక్కడ చేశాయి? ఎంతమందిని ప్రశ్నించాయి? ఏ నియోజకవర్గాల్లో తిరిగాయి? నమూనా ఎలా ఎంపిక చేశాయి? గతంలో చెప్పిన అంచనాలు ఎంతవరకు నిజమయ్యాయి? ఊరు, పేరు లేని సంస్థలు ఒక్కసారిగా రాజకీయ భవిష్యత్తును ఎలా చెప్పగలుగుతున్నాయి? ప్రజాభిప్రాయాన్ని కొలవాల్సిన సర్వేలు.. రాజకీయ ప్రచారానికి ఆయుధాలుగా మారుతున్నాయా? తాజాగా కూటమి గెలుస్తోందన్న సర్వే వైసీపీలో కొత్త చర్చకు కారణమైంది. అన్నీ మంచి శకునములే అంటూ టీడీపీ భావిస్తోంది. ఐతే, ప్రజలు నమ్మాల్సింది గణాంకాలనా.. క్షేత్రస్థాయి వాస్తవాలనా?
ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయడానికి సర్వేలు జరుగుతాయి. ఎన్నికల వేళ ఏ పార్టీకి ప్రజల మద్దతు ఉందో, ఏ నాయకుడి వైపు ఓటరు మొగ్గు చూపుతున్నాడో తెలుసుకోవడానికి సర్వేలు కీలక సాధనంగా మారాయి. రాజకీయ పార్టీల వ్యూహాలకు, నాయకుల నిర్ణయాలకు, ప్రజా సమస్యలపై అవగాహనకు ఇవి ఉపయోగపడుతుంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే సర్వేల హడావుడి మొదలైంది. రెండున్నరేళ్లు కూడా పూర్తికాకముందే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అంటూ వరుస సర్వేలు తెరపైకి వస్తున్నాయి. ప్రత్యేకంగా గతంలో పెద్దగా పరిచయం లేని సంస్థలు కూడా తాము రాష్ట్రవ్యాప్తంగా సర్వేలు నిర్వహించామని ప్రకటిస్తున్నాయి. అయితే ఆ సంస్థల గత రికార్డు ఏమిటి? గతంలో చేసిన సర్వేల్లో వాటి అంచనాలు ఎంతవరకు నిజమయ్యాయి? ఎన్ని నియోజకవర్గాల్లో, ఎన్ని నమూనాలతో సర్వే చేశాయి? ప్రజల మధ్యకి వెళ్లి అభిప్రాయాలను ఎలా సేకరించాయి? వంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు కనిపించకపోవడం చర్చకు దారితీస్తోంది. ఊరూ, పేరు లేని సంస్థలు ఒక్కసారిగా రాజకీయ భవిష్యత్తును చెప్పడం పట్ల ప్రజల్లోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎవరి సర్వే? ఏ ప్రాతిపదికన?
ఇటీవల ఏపీలో రాజకీయ సర్వేల పేరుతో వెలువడుతున్న అంచనాలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ఒక సర్వే కూటమిలో అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ, వచ్చే ఎన్నికల్లో తిరిగి గెలుస్తోందని చెప్పింది. ఇంకో సర్వే కూటమికే అడ్వాంటేజ్ ఉందని పేర్కొంది. ఇంకో సంస్థ వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని చెప్పింది. మరో సంస్థ జగన్కు సానుకూలమంది. ఒకే రాష్ట్రం, ఒకే రాజకీయ పరిస్థితి, భిన్నమైన అంచనాలు.. ఇదే ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. సర్వే నిర్వహించిన సంస్థ ఎవరు? ఎంతమందిని ప్రశ్నించారు? ఏ ప్రాంతాల్లో అభిప్రాయాలు సేకరించారు? పట్టణాలు, గ్రామాలు, నియోజకవర్గాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఎంత? ఓటర్ల వయసు, సామాజిక వర్గం, ప్రాంతం, గత ఓటింగ్ తీరు వంటి అంశాలను ఎలా పరిగణనలోకి తీసుకున్నారు? సర్వే తేదీలు ఏమిటి? నమూనా పరిమాణం ఎంత? వంటి ప్రాథమిక వివరాలు బయటకు రావాల్సి ఉంది. కేవలం ఒక ప్రకటన, కొన్ని గణాంకాలు, కొన్ని రాజకీయ అంచనాలతో సర్వే విశ్వసనీయతను నిర్ణయించలేం. సర్వే వెనుక ఉన్న పద్ధతి, సంస్థ అనుభవం, గత ఫలితాలతో పోలికే దాని బలాన్ని నిర్ణయిస్తాయి.
సర్వేనా? ప్రచారమా? ఇదే ప్రశ్న
సర్వే అనేది ప్రజాభిప్రాయానికి అద్దంలా ఉండాలి. కానీ ఆ అద్దం ఎవరి చేతిలో ఉంది? దానిలో కనిపిస్తున్న చిత్రం నిజమైనదేనా? లేక ముందే నిర్ణయించిన రాజకీయ కథనానికి అనుగుణంగా రూపొందించిన ప్రతిబింబమా? ఇదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. సర్వే చేసిందెవరు? చెప్తోందెవరు? ఏవరి సర్వే ఏంటి? చైతన్యం లేని సర్వే సారాంశమేంటి? సర్వే సంస్థల అసలు గుట్టేంటి? అన్న ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. ఒక సంస్థ పేరు చెప్పిందని, ఒక గణాంకం విడుదల చేసిందని దాన్ని ప్రజాభిప్రాయంగా అంగీకరించాల్సిన అవసరం లేదు. ప్రజల అసలు అభిప్రాయం తెలుసుకోవాలంటే క్షేత్రస్థాయిలోకి వెళ్లాలి. గ్రామం నుంచి నగరం వరకు ఓటరు ఆలోచనను అర్థం చేసుకోవాలి. గత సర్వేల ఫలితాలను పరిశీలించాలి. సంస్థ చెప్పిన అంచనాలకు ఆధారాలు ఏంటో ప్రజలకు తెలియాలి. లేదంటే ఎన్నికల రాజకీయాల్లో సర్వేలు సమాచారం కంటే ప్రచార సాధనాలుగా మారే ప్రమాదం ఉంటుంది. ప్రజలు కూడా ఇదే ప్రశ్నను ముందుకు తెస్తున్నారు.
#AndhraPradesh #APPolitics #PoliticalSurveys #OpinionPolls #ElectionSurveys #APElectionSurvey #YSJagan #YSRCP #ChandrababuNaidu #TDP #TDPAlliance #VoterMood #ElectionPredictions #SurveyCredibility #AndhraPradeshPolitics











