అక్టోబర్ 12 నుంచి బ్రహ్మోత్సవాలు.
తిరుమల శ్రీవారి నవనవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు ప్రారంభించింది. అక్టోబర్ 12 నుంచి 20 వరకు తొమ్మిది రోజుల పాటు స్వామివారి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. దసరా నవరాత్రుల సమయంలో అదనపు చాంద్రమాసం వచ్చిన సంవత్సరాల్లో ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. అక్టోబర్ 11న రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. వాహన సేవలు సాధారణంగా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు నిర్వహించనున్నారు.
గరుడసేవకు ప్రత్యేక ప్రాధాన్యం
నవనవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పలు వాహన సేవలు భక్తులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. అక్టోబర్ 16న గరుడ వాహన సేవ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు నిర్వహిస్తారు. అక్టోబర్ 17న పుష్పక విమానం, అక్టోబర్ 19న స్వర్ణ రథోత్సవం జరగనుంది. అక్టోబర్ 20న ఉదయం 6 గంటలకు చక్రస్నానం నిర్వహిస్తారు. పెద్దశేష వాహనం, చిన్నశేష వాహనం, హంస వాహనం, సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, హనుమంత వాహనం, గజ వాహనం, సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు కూడా ఉత్సవాల్లో భాగంగా ఉంటాయి.

భారీగా భక్తులు వచ్చే అవకాశం
అక్టోబర్ 12న పెద్దశేష వాహనంతో ఉత్సవాలు ప్రారంభమై, అక్టోబర్ 20న చక్రస్నానంతో ముగుస్తాయి. గరుడ వాహనం, స్వర్ణ రథం, చక్రస్నానం ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. సాధారణ వార్షిక బ్రహ్మోత్సవాలకు భిన్నంగా నవనవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, పెద్ద రథోత్సవం, ధ్వజావరోహణం ఉండవు. తొమ్మిది రోజుల వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. భక్తులకు దర్శనం, వాహన సేవలు సౌకర్యవంతంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారిస్తోంది.











