గజం అదనంగా ఉన్నా ప్రభుత్వానికే.
అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన భూ ఆరోపణలపై తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత తీవ్రంగా స్పందించారు. తన ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తుల కంటే ఒక్క గజం భూమి అదనంగా ఉన్నట్లు నిరూపించినా ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తానని సవాల్ చేశారు. తన కుటుంబంపై సీఎం చేసిన ఆరోపణలు అసత్యమని, ఆయన మాటలపై తమకు విశ్వాసం లేదని పేర్కొన్నారు. భూ వ్యవహారాల్లో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సీఎం ప్రస్తావించిన వ్యక్తుల భూములపైనా దర్యాప్తు జరపాలని కోరారు.
అందరి భూములపై విచారణ కోరుతూ
కేసీఆర్ ఫాంహౌస్ వ్యవహారంతో పాటు సీఎం ప్రస్తావించిన నవీన్‌రావు, కొండల్రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, రామేశ్వర్రావు, ప్రతిమ శ్రీనివాస్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డి తదితరుల భూములపై సమగ్ర విచారణ జరపాలని కవిత డిమాండ్ చేశారు. ‘గుంపు మేస్త్రీ–గుంటనక్క’ కలిసే ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒక్క గజం భూమి ఉన్నా, అఫిడవిట్లో చూపించిన దానికంటే అదనపు భూమి ఉన్నా ప్రభుత్వానికి అప్పగిస్తానని మరోసారి స్పష్టం చేశారు. సీఎం ఆరోపణలకు కవిత సవాల్ జత కావడంతో తెలంగాణలో భూముల వివాదం రాజకీయంగా మరింత చర్చనీయాంశమైంది.
#KKavitha #Kavitha #RevanthReddy #TelanganaLandRow #LandControversy #LandInquiry #CBIProbe #KCRFarmhouse #22ALands #LandRecords #ElectionAffidavit #TelanganaPolitics #BRS #TelanganaRakshanaSena #LandDispute











