Home AP ఉత్తరాంధ్రపై వర్షం పంజా 48 గంటలు అప్రమత్తత

ఉత్తరాంధ్రపై వర్షం పంజా 48 గంటలు అప్రమత్తత

అల్పపీడనంతో భారీ వర్షాలు.

ఆంధ్రప్రదేశ్‌పై వర్ష ముప్పు మళ్లీ పెరిగింది. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ హెచ్చరించింది. ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలి విదర్భ వైపు వెళ్లే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలకు ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పటికే శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వర్షాభావంతో ఇబ్బంది పడిన ప్రాంతాలకు ఈ వానలు కొంత ఉపశమనం కలిగించాయి.

విజయవాడలో నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు

అల్పపీడన ప్రభావంతో విజయవాడ, విశాఖపట్నంలో ఉరుములతో కూడిన వర్షాలు నమోదయ్యాయి. విజయవాడలో పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బెంజ్‌ సర్కిల్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు దాదాపు గంటపాటు నిలిచిపోయాయి. విశాఖలో వరద పరిస్థితి లేకపోయినా చిరుజల్లులు, మోస్తరు వర్షాలు కొనసాగాయి. దీంతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆదివారం ఎల్లో అలర్ట్‌ కొనసాగుతోంది. ఆదివారం అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

పశ్చిమగోదావరిలో అత్యధిక వర్షపాతం

భారీ వర్షాల ప్రభావం ప్రధానంగా పశ్చిమగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో కనిపించింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు పశ్చిమగోదావరిలో సగటున 46.2 మిల్లీమీటర్లు, కోనసీమలో 36.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పశ్చిమగోదావరిలో పెనుగొండలో 108.2 మి.మీ., ఇరగవరం 107 మి.మీ., పెనుమంట్ర 104.6 మి.మీ., ఆచంట 97.6 మి.మీ., గణపవరం 94.6 మి.మీ. వర్షం నమోదైంది. శ్రీకాకుళం కంచిలిలో 73.8 మి.మీ., కవిటిలో 63.4 మి.మీ., విజయవాడ రూరల్‌లో 61.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. రాయలసీమలో మాత్రం వర్ష ప్రభావం తక్కువగా కనిపించింది.

 

#NorthAndhra #NorthAndhraRain #APRainAlert #HeavyRainAlert #AndhraPradeshWeather #APWeather #LowPressureArea #HeavyRains #APRainForecast #APSDMA #VijayawadaRain #VisakhapatnamRain #YellowAlert #WestGodavari #Konaseema #CoastalAndhra #NorthCoastalAndhra #RainAlert #WeatherUpdate #APNews