తెలంగాణకు అవమానమంటూ సీఎం ఆగ్రహం
అమెరికా పర్యటనకు కేంద్రం రాజకీయ అనుమతి నిరాకరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయం తన వ్యక్తిగత వ్యవహారం కాదని, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వానికి జరిగిన అవమానమని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, అంతర్జాతీయ విద్యా సంస్థలు, క్రీడా సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేయడం వంటి లక్ష్యాలతో అమెరికా పర్యటనకు ప్రతిపాదన పంపినట్లు చెప్పారు. పర్యటన ఉద్దేశాలు, కలవాల్సిన వ్యక్తుల వివరాలను కేంద్రానికి పూర్తిగా అందించినా అనుమతి ఎందుకు నిరాకరించారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ నిర్ణయం వెనుక ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం లేకుండా జరిగే అవకాశం ఉందా అని ప్రశ్నిస్తూ కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతోందా? అని నిలదీశారు.
మామ్దానీ భేటీపై రేవంత్ వివరణ
తాను న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దానీని కలవడానికి ప్రత్యేక అపాయింట్మెంట్ తీసుకున్నట్లు వచ్చిన ప్రచారాన్ని రేవంత్ రెడ్డి ఖండించారు. అలాంటి భేటీ ఖరారు కాలేదని స్పష్టం చేశారు. మామ్దానీ ప్రజాప్రతినిధి మాత్రమేనని, ఆయనను కలవడం తప్పు కాదని అన్నారు. అధికారిక విదేశీ పర్యటనల్లో ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల సమావేశాలకు విదేశాల్లోని భారత దౌత్య కార్యాలయాలు అవసరమైన ఏర్పాట్లు చేస్తాయని వివరించారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌కు అనూహ్యంగా వెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అప్పుడు ఎవరిని అనుమతి అడిగారు? అని ప్రశ్నించారు.
గుజరాత్‌కు ఓకే.. తెలంగాణకు నో?
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఇటీవల అమెరికా, కెనడాలో ఎనిమిది రోజుల పర్యటన చేసి వైబ్రాంట్ 2047 కార్యక్రమం కోసం పెట్టుబడులు ఆకర్షించిన విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు. అదే తరహాలో తెలంగాణ రైజింగ్ 2047 కోసం తాను అమెరికా వెళ్లాలని ప్రతిపాదిస్తే అనుమతి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణను తక్కువగా చూస్తున్నారా? రాష్ట్రంపై వివక్ష ఎందుకు? అంటూ కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్ర నిర్ణయాన్ని ప్రశ్నించాలని కోరారు. అమెరికా పర్యటనకు అనుమతి రాకపోయినా తెలంగాణ రైజింగ్ 2047 కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందని రేవంత్ ప్రకటించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలతో పాటు తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
#RevanthReddy #TelanganaCM #USVisit #AmericaTour #RevanthReddyUSVisit #Telangana #TelanganaRising2047 #TelanganaInvestments #USInvestments #CentralGovernment #PMO #TelanganaBJP #ZohranMamdani #GujaratCM #BhupendraPatel #InvestmentSummit #TelanganaPolitics #Congress #BJP #TelanganaNews











