Home AP అమర్నాథ్ వ్యాఖ్యలపై రాద్ధాంతం

అమర్నాథ్ వ్యాఖ్యలపై రాద్ధాంతం

40

కూటమి కుట్రలంటూ పేర్ని నాని ధ్వజం

వైయ‌స్ఆర్‌సీపీ నేత గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను కూటమి పార్టీలు కావాలనే పక్కదోవ పట్టిస్తున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. హోంమంత్రి అనితను ఆయన కించపరిచారని, మొత్తం స్త్రీ సమాజాన్ని అవమానించారంటూ తెలుగుదేశం, జనసేన పార్టీలు నానా హంగామా చేస్తున్నాయని ధ్వజమెత్తారు. నారా లోకేశ్ ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ విషయంపై చాలా అతిగా స్పందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ సైతం హోంమంత్రి కట్టూ బొట్టూ గురించి మాట్లాడారంటూ ట్వీట్లు పెడుతున్నారని దుయ్యబట్టారు. అమర్నాథ్ మాట్లాడింది కేవలం హోంమంత్రి మేకప్ గురించి మాత్రమేనని, ఆయన ఎక్కడా కట్టూ బొట్టూ గురించి మాట్లాడలేదని పేర్ని నాని స్పష్టం చేశారు.

హోంమంత్రి గత వ్యాఖ్యలపై విమర్శలు
రాజకీయాల్లో కొందరికి సభ్యత లేకుండా మాట్లాడే ఓరల్ డయేరియా అనే రుగ్మత ఉంటుందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. హోంమంత్రి అనిత నోటి నుంచి కూడా మాటలు ఎప్పుడూ హద్దులు దాటి వస్తుంటాయని విమర్శించారు. ఆమె అందరినీ విచ్చలవిడిగా తిడుతూ సమాజం నుంచి మాత్రం గౌరవం కోరుకోవడం ఎంతవరకు ధర్మమని ప్రశ్నించారు. అద్దాల మేడలో కూర్చుని సమాజం మీద రాళ్లు వేస్తే తిరిగి రాళ్లే వస్తాయన్న విషయం లోకేశ్, పవన్ తెలుసుకోవాలని హెచ్చరించారు. వాయనం ఇస్తే తిరిగి వాయనం వస్తుందని కూటమి నేతలు గుర్తుంచుకోవాలన్నారు. గతంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతమ్మలపై అనిత చేసిన దారుణమైన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.