Home AP దక్షిణాది అభివృద్ధికి చంద్రబాబు బిగ్ ప్లాన్

దక్షిణాది అభివృద్ధికి చంద్రబాబు బిగ్ ప్లాన్


సీఎంల సమక్షంలో కీలక ప్రతిపాదనలు.

మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ సీఎంలు, పుదుచ్చేరి ప్రతినిధులు హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాల సమగ్ర అభివృద్ధిపై చంద్రబాబు పలు కీలక ప్రతిపాదనలు చేశారు. రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఉమ్మడి లాజిస్టిక్స్‌ నెట్‌వర్క్‌, డ్రైపోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు దక్షిణాది విద్యుత్‌ గ్రిడ్‌ను జాతీయ గ్రిడ్‌తో అనుసంధానం చేయాలని కోరారు.

నీటి సమస్యకు నదుల అనుసంధానం

దక్షిణాది రాష్ట్రాల మధ్య జలవనరులపై సమన్వయం అవసరమని చంద్రబాబు స్పష్టం చేశారు. గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా తమిళనాడు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు. కావేరి నదుల అనుసంధానంతో 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించే ప్రతిపాదనను ప్రస్తావించారు. గంగా–కావేరి అనుసంధానానికి దీర్ఘకాలిక జాతీయ ప్రణాళిక రూపొందించాలని కోరారు. నదుల అనుసంధాన ప్రాజెక్టులకు కాలపరిమితితో కూడిన డీపీఆర్‌లు, అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కలిసి జల సమస్యలపై ముందుకు సాగాలని సూచించారు.

10 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం

దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 31 శాతం ఉందని చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందన్నారు. విపత్తుల సమయంలో పరస్పర సహకారం కోసం మ్యూచువల్‌ ఎయిడ్‌ ఫోర్స్‌, విద్యా సంస్థలు, స్కిల్లింగ్‌ సంస్థలతో ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్‌ధామ్‌ వరకు ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్‌ ఏర్పాటు చేయాలని కోరారు. విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9, 10 సంస్థల విభజన 12 ఏళ్లుగా పూర్తి కాలేదని గుర్తుచేశారు. చంద్రబాబు ప్రసంగాన్ని కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ ప్రశంసిస్తూ, దక్షిణాది అభివృద్ధిపై ఆయన విశాల దృక్పథంతో మాట్లాడారని పేర్కొన్నారు.

 

#ChandrababuNaidu #SouthernZonalCouncil #SouthIndiaDevelopment #AndhraPradesh #SouthIndianStates #GodavariCauveryLink #RiverLinking #LogisticsNetwork #DryPorts #PowerGrid #WaterResources #EconomicDevelopment #10TrillionEconomy #India2047 #Amaravati