మళ్లీ జట్టుకడుతున్న ట్రంప్–మస్క్.
వెయ్యి కోట్ల ప్రాజెక్టుతో కొత్త డీల్.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా–స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మధ్య ఒకప్పుడు రగిలిన తీవ్ర వివాదం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. నెలల తరబడి కొనసాగిన రాజకీయ విభేదాలకు తెరపడుతూ ఇద్దరూ మళ్లీ మాట్లాడుకుంటున్నారు. తాజాగా చైనాకు వెళ్లే విమానంలో ఇద్దరూ స్నేహపూర్వకంగా కనిపించడం ఈ మార్పుకు సంకేతంగా నిలిచింది.
ఎన్నికల కోసం భారీ సాయం
అమెరికా నవంబర్ మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు మద్దతుగా మస్క్ భారీ మొత్తాన్ని ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ట్రంప్ అనుకూల రాజకీయ కార్యక్రమాల కోసం కనీసం 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. కీలక రాష్ట్రాల్లో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఈ నిధులను వినియోగించనున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి మస్క్ భారీగా మద్దతిచ్చారు. దాదాపు 300 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి ట్రంప్ ప్రచారానికి అండగా నిలిచారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మస్క్ వైట్‌హౌస్‌కు దగ్గరగా పనిచేశారు. DOGE ద్వారా ప్రభుత్వ ఖర్చులు తగ్గించే కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు.
ఒక్కసారిగా రాజకీయ వైరం
అయితే ఈ సాన్నిహిత్యం ఎక్కువ కాలం నిలవలేదు. మస్క్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించడం మొదలుపెట్టారు. ట్రంప్ తీసుకొచ్చిన పన్నులు, ఖర్చులకు సంబంధించిన బిల్లును మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. ట్రంప్ ఎన్నికల్లో గెలవడానికి తన సహాయం కీలకమని కూడా మస్క్ బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. వివాదం తీవ్రంగా ఉన్న సమయంలో మస్క్ సోషల్ మీడియాలో ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేశారు. జెఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన ఫైళ్లలో ట్రంప్ పేరు ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై ట్రంప్ తీవ్రంగా స్పందించి మస్క్ కంపెనీల ప్రభుత్వ ఒప్పందాలను రద్దు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి.
తెరవెనుక రాజీ ప్రయత్నాలు
అయితే ఈ విభేదాలు శాశ్వతంగా కొనసాగకుండా వైట్‌హౌస్ వర్గాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా పలువురు నేతలు మస్క్‌తో సంబంధాలను కొనసాగించారు. మస్క్ కూడా కొన్ని వ్యాఖ్యల విషయంలో తాను హద్దు దాటినట్లు అంగీకరించారు. స్పేస్‌ఎక్స్‌కు అమెరికా రక్షణ రంగం, నాసాతో ఉన్న కీలక ఒప్పందాలు కూడా ఈ సంబంధాన్ని పూర్తిగా తెంచుకోవడం కష్టతరం చేశాయి. మస్క్ రాజకీయ పార్టీ ఏర్పాటు ఆలోచనను విరమించుకోవడం, జారెడ్ ఐజాక్‌మన్‌ను నాసా అధిపతిగా తిరిగి నియమించడం వంటి పరిణామాలు కూడా సంబంధాల మెరుగుదలకు దోహదపడ్డాయి. తరువాత ట్రంప్ విందుకు మస్క్ హాజరయ్యారు. ఇద్దరూ మళ్లీ బహిరంగ కార్యక్రమాల్లో కనిపించడం మొదలైంది.
నెలకోసారి కీలక చర్చలు
ప్రస్తుతం ట్రంప్, మస్క్ దాదాపు నెలకోసారి మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. కృత్రిమ మేధ, చైనా, ప్రపంచ పరిణామాలు వంటి అంశాలపై చర్చిస్తున్నారని తెలుస్తోంది. అయితే గతంలో ఉన్నంత సన్నిహిత సంబంధం మళ్లీ ఏర్పడుతుందని ట్రంప్ భావించడం లేదని ఆయన సన్నిహితులకు చెప్పినట్లు సమాచారం. మధ్యంతర ఎన్నికల్లో మస్క్ మళ్లీ అమెరికా పీఏసీ ద్వారా రిపబ్లికన్లకు మద్దతివ్వనున్నారు. అయితే గత ఎన్నికల మాదిరిగా రాజకీయాల్లో అతిగా జోక్యం చేసుకోబోనని మస్క్ సంకేతాలు ఇస్తున్నారు. గతంలో రాజకీయాల్లో తాను కొంత ఎక్కువగా మునిగిపోయానని స్వయంగా అంగీకరించిన మస్క్.. ఇప్పుడు మాత్రం 100 మిలియన్ డాలర్లతో పరిమితమైనా ప్రభావవంతమైన రాజకీయ పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు.
#DonaldTrump #ElonMusk #TrumpMusk #TrumpMuskAlliance #USMidtermElections #Republicans #ElonMuskPolitics #TrumpCampaign #Tesla #SpaceX #USPolitics #PoliticalDeal #TrumpMuskReconciliation











