Home Inter National News ట్రంప్‌ వెంటాడుతున్న ఇరాన్‌ ఎక్కడ ఉంటాడో కూడా తెలుసన్న రిపోర్ట్

ట్రంప్‌ వెంటాడుతున్న ఇరాన్‌ ఎక్కడ ఉంటాడో కూడా తెలుసన్న రిపోర్ట్


విమానంలో ఉన్నా ఎటాక్ చేసే స్కెచ్
ట్రంప్‌ కదలికలపై ఖమేనీ నిఘా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భద్రతపై సంచలన సమాచారం వెలుగులోకి వచ్చింది. నాటో సదస్సు సందర్భంగా టర్కీలోని అంకారాలో ట్రంప్‌ బస చేసిన ప్రాంతం, ఆయన ఉన్న భవనంలోని ఫ్లోర్‌ వరకు ఇరాన్‌కు చెందిన ఆపరేటివ్‌లకు తెలుసన్న అమెరికా ఇంటెలిజెన్స్‌ సమాచారం బయటపడింది. ది న్యూయార్క్ టైమ్స్‌ను ఉటంకిస్తూ వచ్చిన నివేదిక ప్రకారం.. ట్రంప్‌ టర్కీ నుంచి బయలుదేరే సమయంలో ఆయనను లక్ష్యంగా చేసుకునే ముప్పుపై అమెరికా భద్రతా సంస్థలకు పలు నిఘా సమాచారాలు అందాయి.

ఎయిర్‌ఫోర్స్‌ వన్‌పై మిసైల్‌ ముప్పు

జూలై 8న నాటో సదస్సు ముగిసిన తర్వాత అంకారా నుంచి ట్రంప్‌ బయలుదేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ హెచ్చరికలు వచ్చాయని సమాచారం. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ను భూమి నుంచి ప్రయోగించే ఉపరితలం నుంచి గగనతల మిసైల్‌తో లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించినట్లు నివేదిక పేర్కొంది. అంతేకాదు.. నాటో సదస్సు సమీపంలో భుజంపై మోసుకెళ్లే మిసైల్‌తో ఓ వ్యక్తి కనిపించినట్లు కూడా సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ వివరాలను తీవ్రంగా పరిగణించిన అమెరికా భద్రతా వ్యవస్థ ట్రంప్‌ ప్రయాణ ప్రణాళికను మార్చినట్లు సమాచారం.

కెమెరాల ముందు ఒక విమానం.. వెనుక మరో ప్లాన్‌

ట్రంప్‌ పాత ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లోనే టర్కీ నుంచి బయలుదేరతానని బహిరంగంగా ప్రకటించారు. మీడియా కెమెరాల ముందే ఆ విమానంలోకి ఎక్కారు. దీంతో ఆయన అదే విమానంలో వెళ్తున్నారనే భావన కలిగింది. కానీ అసలు ప్రణాళిక పూర్తిగా భిన్నంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వైట్‌హౌస్‌ సిబ్బంది, భద్రతా సిబ్బంది, జర్నలిస్టులు ఉన్న డికాయ్‌ విమానం గాల్లోకి వెళ్లిన తర్వాత ట్రంప్‌ను విమానాశ్రయంలోని క్యాటరింగ్‌ కంటైనర్‌ ద్వారా మరో ప్రాంతానికి తరలించారు. అక్కడి నుంచి చిన్న సైనిక విమానంలో ఆయనను టర్కీ నుంచి బయటకు తీసుకెళ్లారు.

ఖతార్‌ విమానం కూడా కారణమేనా?

ట్రంప్‌ టర్కీకి ఖతార్‌ అందించిన లగ్జరీ బోయింగ్‌ 747లో చేరుకున్నారు. అయితే ఆ విమానంలో పాత ఎయిర్‌ఫోర్స్‌ వన్‌కు ఉన్న స్థాయి మిసైల్‌ రక్షణ వ్యవస్థలు లేవని సమాచారం. ఈ కారణం కూడా విమానం మార్చే నిర్ణయంలో కీలకంగా మారినట్లు తెలుస్తోంది. ఈ రహస్య ఆపరేషన్‌లో తమను డికాయ్‌గా ఉపయోగించారని తెలుసుకున్న కొందరు జర్నలిస్టులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ట్రంప్‌ మాత్రం ముప్పుపై పెద్దగా ఆందోళన చెందలేదు. ‘‘ముప్పు ఉందని అనుకుంటా.. నాకు చాలా బెదిరింపులు వస్తుంటాయి’’ అన్నట్లుగా స్పందించారు. తాజా నివేదికలు మాత్రం ట్రంప్‌ భద్రతపై అమెరికా నిఘా వ్యవస్థ ఎంత తీవ్రమైన హెచ్చరికను అందుకుందో స్పష్టం చేస్తున్నాయి.

 

#DonaldTrump #Trump #Iran #IranThreat #TrumpSecurity #AirForceOne #TrumpIran #USIntelligence #NATOSummit #Ankara #Turkey #TrumpSecurityThreat #IranTensions #Geopolitics #WorldNews