ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా ఆర్థిక వృద్ధి మాత్రం ఆగకూడదన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 51.8 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం, నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయినా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 15 శాతం వృద్ధిరేటు దిశగా తీసుకెళ్లేందుకు ప్రతి శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రజలపై అదనపు ధరల భారం పడకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఆర్థిక వ్యవస్థపై రివ్యూ
ప్రభుత్వం సమర్పించిన జులై ఆర్థిక నివేదిక ప్రకారం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గత రెండేళ్లుగా జాతీయ సగటు కంటే మెరుగైన ప్రగతి సాధిస్తోంది. 2025–26 రెండో త్రైమాసికంలో 10.7 శాతం వృద్ధిరేటు నమోదైంది. వాస్తవ వృద్ధిరేటు 9.9 శాతంగా ఉంది. 2023–24లో 6.5 శాతంగా ఉన్న రియల్ జీఎస్‌డీపీ.. 2025–26 నాటికి 9.9 శాతానికి చేరింది. అంటే రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయన్నమాట. వ్యవసాయం 13.5 శాతం, పరిశ్రమలు 10.6 శాతం, సేవల రంగం 9.9 శాతం వృద్ధి సాధించాయి.
ఆదాయం.. పెట్టుబడుల్లో జోరు
రాష్ట్ర ఆదాయ పరిస్థితిలోనూ సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించడం వల్ల జీఎస్టీ వసూళ్లు 21 శాతం పెరిగి రూ.13,282 కోట్లకు చేరాయి. సాధారణ ఎగుమతులు రూ.16,322 కోట్లకు చేరి 10.5 శాతం వృద్ధి సాధించాయి. ఎస్‌టీపీఐ ఎగుమతులు 32.2 శాతం పెరిగాయి. వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్లు 51.6 శాతం పెరగడం ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్నాయన్న సంకేతంగా ప్రభుత్వం భావిస్తోంది. రూ.2.88 లక్షల కోట్ల భారీ, మెగా ప్రాజెక్టుల గ్రౌండింగ్‌లో 75.4 శాతం పురోగతి సాధించినట్లు నివేదిక వెల్లడించింది.
రివ్యూ అసలు ఉద్దేశం
సంఖ్యలు బాగున్నా ముందున్న సవాళ్లను విస్మరించొద్దన్నది చంద్రబాబు సూచన. వర్షాలు తగ్గితే నీటి కొరత, వ్యవసాయ ఉత్పత్తుల తగ్గుదల, ధరల పెరుగుదల వచ్చే అవకాశం ఉంది. అందుకే జిల్లా, నియోజకవర్గం, మండలాల వారీగా కంటింజెన్సీ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ నీరు ఎంత ఉంది? ఏ పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి? ఉత్పత్తులకు అదనపు విలువ ఎలా తీసుకురావాలి? పెట్టుబడులను ఎలా వేగంగా అమలు చేయాలి? అనే అంశాలపై ముందస్తు ప్రణాళిక ఉండాలని సూచించారు. మొత్తంగా ఆర్థిక వృద్ధి పెరగాలి.. పెట్టుబడులు రావాలి.. ప్రభుత్వ ఆదాయం పెరగాలి.. కానీ ఆ భారాన్ని ప్రజలపై ధరల రూపంలో వేయకూడదు అన్నదే చంద్రబాబు రివ్యూ సారాంశం.
#AndhraPradesh #ChandrababuNaidu #APEconomy #EconomicGrowth #AndhraPradeshEconomy #Drought #RainfallDeficit #SuperElNino #EconomicDevelopment #APGovernment #Investment #GSTRevenue #Agriculture #Industries #ServicesSector











