ఉమ్మడి కడపజిల్లా రాజంపేట టీడీపీలో నెలలుగా రగులుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు పార్టీ అత్యున్నత స్థాయికి చేరినట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజు పై అసమ్మతి నేతలు వ్యక్తం చేసిన అభ్యంతరాలు, సోషల్ మీడియాలో పరస్పర విమర్శలు, పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసిన పరిణామాలు అన్నీ ఒకే నివేదికగా అధిష్ఠానం ముందుకు వెళ్లినట్టు సమాచారం. ఆ నివేదిక ఇప్పుడు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు టేబుల్‌పై ఉందన్న ప్రచారం రాజంపేట రాజకీయాలను ఉత్కంఠకు గురిచేస్తోంది.
అధినేతకు అసమ్మతి నేతల నివేదిక
అసమ్మతి నేతలను అమరావతికి పిలిపించి నేరుగా అభిప్రాయాలు తెలుసుకోవడం, జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య, పరిశీలకుడు చిట్టిబాబు నాయుడు, పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు సేకరించిన వివరాలను రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ద్వారా అధినేతకు అందజేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణ ఫిర్యాదుగా కాకుండా, సంస్థాగత నివేదికగా ఈ వ్యవహారం మారడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. 2024 ఎన్నికల్లో గెలవాల్సిన స్థానం చేజారిపోయిన నియోజకవర్గాల జాబితాలో రాజంపేటకు ప్రత్యేక స్థానం ఉంది.
పేట నిర్ణయంపై అధిష్ఠానం సస్పెన్స్
అందుకే ఈ నియోజకవర్గంపై అధిష్ఠానం ప్రత్యేక దృష్టి పెట్టిందనే చర్చ నడుస్తోంది. ఇటీవల పలుచోట్ల ఇన్‌చార్జిల మార్పులు చేసిన పార్టీ, రాజంపేట విషయంలోనూ అదే దారిలో వెళ్తుందా? లేక ప్రస్తుత నాయకత్వానికే మరో అవకాశం ఇస్తుందా? అన్న ప్రశ్నలు కేడర్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజంపేటపై తీసుకునే నిర్ణయం ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాదు. పార్టీ క్రమశిక్షణ, నాయకత్వంపై అధిష్ఠానం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో తెలిపే సంకేతంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజంపేటలో అందరి చూపు ఒకే ఫైల్‌పై ఉంది… ఆ ఫైల్‌పై అధినేత సంతకం ఎప్పుడు పడుతుందన్నదే అసలు సస్పెన్స్.
#Rajampet #TDP #ChandrababuNaidu #AndhraPradeshPolitics #KadapaPolitics #TeluguDesamParty #TDPLeadership #APPolitics #RajampetConstituency #ChamarthiJaganmohanRaju #PoliticalUpdates #APNews #LocalElections #TDPInternalIssues











