Home Telangana విదేశీ ఉద్యోగాలకు సమగ్ర సాయం

విదేశీ ఉద్యోగాలకు సమగ్ర సాయం


పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కామ్‌దే బాధ్యత.
శ‌క్తి శాఖ స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి.

తెలంగాణ యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు మరింత సులభం చేసేందుకు టామ్‌కామ్‌కు కొత్త బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. పాస్‌పోర్టు పొందడం నుంచి విదేశాల్లో ఉద్యోగం కల్పించడం వరకు టామ్‌కామ్ బాధ్యత వహించాలని ఆదేశించారు. విదేశాలకు వెళ్లే కార్మికులు ఏజెంట్ల చేతిలో మోసపోకుండా ఆయా దేశాల మ్యాన్‌పవర్ కంపెనీలతో టామ్‌కాం నేరుగా ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. కార్మికుల వివరాలను నమోదు చేయడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. టామ్‌కాంకు మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారిని సీఈవోగా నియమించనున్నట్లు తెలిపారు. లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్‌లో ప్రత్యేక శిక్షణ కూడా అందించాలని ఆదేశించారు.

స్కిల్ యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో అత్యాధునిక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. జర్మన్, జపనీస్, కొరియన్, చైనీస్ వంటి విదేశీ భాషల బోధనకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు, ఐటీఐలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలని చెప్పారు. ఏటీసీల్లో ఈవీ సర్వీసింగ్, డ్రోన్ టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెట్టాలని, బ్లూ కాలర్ ఉద్యోగాల కోసం శిక్షణ పొందే వారికి స్కాలర్‌షిప్‌లపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.

నర్సింగ్ కళాశాలలకు ప్రాధాన్యం

దేశీయంగా, విదేశాల్లో నర్సుల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త నర్సింగ్ కళాశాలలకు అనుమతులు ఇవ్వనున్నట్లు సీఎం వెల్లడించారు. వృద్ధుల సంరక్షణ అవసరాలు పెరుగుతున్న కారణంగా ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నాయని చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల ఆధారంగా శిక్షణ ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. శక్తి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి నిర్వహించిన సమీక్షలో యువతకు నాణ్యమైన శిక్షణ, మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనపై సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

 

#RevanthReddy #Telangana #TOMCOM #OverseasJobs #ForeignEmployment #TelanganaYouth #JobsAbroad #OverseasEmployment #SkillDevelopment #YoungIndiaSkillUniversity #ForeignLanguageTraining #NursingJobs #NursingEducation #SkillTraining #TelanganaGovernment #EmploymentOpportunities #YouthJobs