Home Telangana తనిఖీల సమాచారం లీక్‌.. డీఈఈ సస్పెండ్‌!

తనిఖీల సమాచారం లీక్‌.. డీఈఈ సస్పెండ్‌!

కొల్లూరు డబుల్ బెడ్‌రూం ఇళ్లపై నిఘా.
లబ్ధిదారులకు ముందే సమాచారం చేరవేత.

డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఆకస్మిక తనిఖీల సమాచారం ముందుగానే లబ్ధిదారులకు చేరవేసిన హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ) చంద్రపాల్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయనను సస్పెండ్ చేస్తూ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి. గౌతమ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పేదలకు ఉచితంగా కేటాయించిన ఇళ్లలో అసలైన లబ్ధిదారులే నివసిస్తున్నారా? లేదా? తెలుసుకునేందుకు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ముఖ్యంగా కొల్లూరులో ఇళ్లు పొందిన పలువురు అక్కడ నివసించకుండా అద్దెకు ఇవ్వడం, ఇతరుల ఆధీనంలో ఉంచడం వంటి ఫిర్యాదులు రావడంతో తనిఖీలు ముమ్మరం చేశారు. గతంలో నోటీసులు అందుకున్న లబ్ధిదారులు తాము ఇళ్లలోనే ఉంటున్నామని సమాధానం ఇవ్వడంతో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ఆదివారం ప్రత్యేక తనిఖీలకు ప్రణాళిక రూపొందించారు. అయితే ఈ సమాచారం ముందుగానే లీక్ అయినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో అధికారులు విచారణ చేపట్టారు. తనిఖీల సమాచారం లీక్ చేసినట్లు నిర్ధారణ కావడంతో చంద్రపాల్‌పై సస్పెన్షన్ వేటు పడింది.

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు!

ప్రభుత్వం పేదలకు కేటాయించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఇతరులకు అద్దెకు ఇవ్వడం, విక్రయించడం, స్వయంగా నివాసం ఉండకుండా ఇతరుల ఆధీనంలో ఉంచడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కేటాయింపులను గుర్తించి నోటీసులు జారీ చేయడంతో పాటు అవసరమైతే కేటాయింపులు రద్దు చేస్తామని హెచ్చరించారు. విధుల్లో నిర్లక్ష్యం, అధికారిక సమాచార గోప్యత ఉల్లంఘన, ప్రభుత్వ లక్ష్యాలకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని ఏమాత్రం సహించబోమని హౌసింగ్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్ పరిసరాల్లో విలువైన భూముల్లో పేదల కోసం నిర్మించిన ఇళ్లు నిజమైన లబ్ధిదారులకే ఉపయోగపడాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.

 

#Kollur #DoubleBedroomHouses #TelanganaHousing #DEEChandrapal #Suspension #SurpriseInspections #HousingCorporation #BeneficiaryVerification